రచయిత, దర్శకనిర్మాత ఈవీవీ సత్యనారాయణ కన్నుమూశారు. తెలుగు సినీ యవనికపై జంధ్యాల తరవాత హాస్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈవీవీ... కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1958 జూన్ 10న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో జన్మించిన ఈవీవీ... 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ తల్లిదండ్రులు వెంకటరావు, వెంకటరత్నం. భార్య సరస్వతి కుమారి. తనయులు ఆర్యన్ రాజేశ్, నరేశ్ ఇద్దరూ సినీ హీరోలే. వీరిలో నరేశ్ అల్లరి నరేశ్‌గా తెలుగు తెరపై తనకంటూ ఒక ఇమేజిని సృష్టించుకున్నారు.
1990లో ‘చెవిలో ఫువ్వు’ సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఇవివి... అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. చివరిగా గతేడాది తనయుడు నరేశ్ హీరోగా కత్తి కాంతారావు సినిమా తీశారు. దర్శకుడిగా ఆయనకిదే చివరి చిత్రం. 22 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసిన ఇవివి... చాలా బాగుంది, అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ వంటి హిట్ చిత్రాలతో సహా మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఇవివి... ‘ఇంద్రుడు-చంద్రుడు’ సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేసి ఆ ముచ్చట కూడా తీర్చుకున్నారు. ఏది చేసినా ఇవివికి తనకంటూ ఒక స్టైలుండేది.
వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఇవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా కిసుక్కున నవ్వొస్తుంది. అదే ఇవివి స్టైలంటే. ఇవివి తల్లిదండ్రులు స్థిరపడింది నిడదవోలు మండలం కోరుమామిడిలో. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇవివికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం. టెన్త్ వరకూ బుద్ధిగానే చదివిన ఆయన నిడదవోలు కళాశాలలో ఇంటర్లో చేరాక... క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసి చివరకు పరీక్ష తప్పారు. 19 ఏట సరస్వతి కుమారితో ఇవివికి వివాహమైంది. ఆయనకు రాజేష్, నరేష్ జన్మించారు.
వ్యవసాయంలో బాగా నష్టాలు రావటంతో పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు దొమ్మేరులో ఉండలేక ఇవివి మరో ఊరికి వెళ్లిపోవాలనుకున్నారు. తన స్నేహితుడు, సినీ నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజు నుంచి రికమండేషన్ లెటర్ రాయించుకుని మద్రాసు వెళ్లారు. నవతా కృష్ణంరాజును కలిసి ఆ లెటర్ ఇవ్వగా సినీ రంగంలో రాణించటం అనుకున్నంత సులభం కాదని, సొంత ఊరికి వెళ్లిపోమని ఆయన హితవు పలికారు. నిరాశ చెందిన ఇవివి చివరకు మద్రాసులోనే ఉండిపోయారు. రోజూ ఉదయం నవతా కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నిలబడేవారు. నెల రోజుల తరువాత ఇవివి పట్టుదలను చూసిన కృష్ణంరాజు ఏం చేయగలవని అడిగారు. సహాయ దర్శకుడిగా పనిచేయాలని ఉందని చెప్పగా, కనకాల దేవదాసుకు సహాయకుడిగా ఓ ఇంటి భాగోతం సినిమాలో అవకాశం ఇప్పించారు.
అప్పటినుంచి ఇవివి వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా పేరొందారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఇవివి నిర్మించిన మొదటి చిత్రం ‘చెవిలో పువ్వు’ అంతగా విజయవంతం కాలేదు. తరువాత రామానాయుడు తాను నిర్మించిన ‘ప్రేమఖైదీ’ చిత్రంలో ఇవివికి అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఇవివికి మంచి అవకాశాలు వచ్చాయి. జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కూడా చిత్రాలు తీశారు. తరువాత తన కుమారులిద్దరినీ హీరోలుగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రంభ, ఊహ, ఆమని, రవళి వంటి నటీమణులను ఇవివి తెలుగు తెరకు పరిచయం చేశారు.