'కన్ను తెరిస్తే ఉయ్యాల... కన్ను మూస్తే మొయ్యాల..' అంటూ రెండే రెండు వాక్యాల్లో జీవిత సత్యం చాటి చెప్పిన గీత రచయిత
జాలాది. జానపద వాడినీ వేడినీ చూపిస్తూ, మాండలిక మాధుర్యాలను పంచిపెడుతూ, మధ్యమధ్యలో గుండె తడిని మిగిల్చిన
పాటలు రాసిన జాలాది రాజారావు (79) ఇక లేరు. కొంత కాలంగా ఆయన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
శుక్రవారం విశాఖపట్నంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
జాలాది 275 సినిమాల్లో దాదాపు 1500 పాటలు రాశారు. పద్యాలు, జానపద గేయాలను కలిపితే ఆయన కలం నుంచి
జాలువారిన రచనలు 2500పైగానే ఉన్నాయి.
జాలాది 1932 ఆగస్టు 9న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ఆయన తండ్రి ఇమ్మాన్యుయల్ తెల్లదొరలకు వ్యతిరేకంగా
పోరాటం చేస్తూ చాలా సార్లు జైలుశిక్ష కూడా అనుభవించారు. జాలాది కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. 13వ ఏటనే
రహస్యంగా జాతీయోద్యమ సంస్థలకు విలువైన సమాచారాన్ని అందిస్తుండేవారు. జాతీయోద్యమకర్తలైన సామూరి
వెంకటరామయ్య, పాకి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలకు లేఖలు రాసేవారు.
చదువు.. కొలువు..:
కృష్ణా జిల్లా బోర్డు స్కూల్‌లో జాలాది ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తిచేశారు. చిత్రలేఖనంలో స్వర్ణపతకం సాధించి అదే పాఠశాలలో
చిత్రలేఖనోపాధ్యాయుడిగా కొలువు సంపాదించారు. ఆ తరవాత వివిధ జిల్లాల్లో పనిచేయడం వల్ల ఆయా ప్రాంతాలకు చెందిన
మాండలికాలపై పట్టు సాధించారు. 1968లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు
వెళ్లారు. తను నేర్చుకున్న మాండలికాలతో పాటలు రాస్తుండడం గమనించిన స్నేహితులు జాలాదిని సినీ రంగప్రవేశం
చేయమని కోరారు. ఆయన్ను మద్రాసు పంపేందుకు చందాలు కూడా పోగేశారు. కానీ అందుకు జాలాది మనసు
అంగీకరించలేదు. ఆ తరవాత ఆయనే సొంతంగా మద్రాసు వెళ్లి సినీ గేయ రచయితగా ప్రయత్నాలు చేశారు.
ప్రస్థానం సాగిందిలా...:
దర్శకుడు పి.సి.రెడ్డి జాలాదికి తొలి అవకాశం ఇచ్చారు. 'పల్లెసీమ' చిత్రం కోసం 'సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు
వానచుక్క' పాటతో ఆయన గేయ రచయితగా ప్రస్థానాన్ని ఆరంభించారు. స్త్రీని ప్రకృతి అందాలతో పోల్చిన తీరు అప్పట్లో
అందర్నీ కట్టిపడేసింది. అనంతరం విజయ నిర్మల దర్శకత్వం వహించిన 'దేవుడే గెలిచాడు' సినిమాలో 'ఈ కాలం పదికాలాల
పాటు బతకాలని' అనే మరో పాట రాశారు. తరవాత ఆ కలం నుంచి ఎన్నో అద్భుత గీతాలు ప్రాణం పోసుకున్నాయి. 'ప్రాణం
ఖరీదు'లో రాసిన 'యాతమేసి తోడినా ఏరు ఎండదు.. పొగిలి పొగిలి యేడ్చినా పొంత నిండదు..' పాట చిరకాల కీర్తిని
తీసుకొచ్చింది. 'వారాలబ్బాయి'లో 'కాకమ్మ కాకి.. కలవోళ్ల కాకి' పాట ద్వారా సమాజంలోని వ్యత్యాసాలను ఎత్తిచూపారు.
అభినవ శశిరేఖవో.., సిరిదేవి సింగారి సిలకా (గృహప్రవేశం), సందెపొద్దు అందాలున్న చిన్నదీ.. (తూర్పు వెళ్లే రైలు),
ఘల్లుఘల్లని కాలి గజ్జెలు మ్రోగంగ.. (చల్ మోహన్‌రంగ) వంటి ఎన్నో పాటలు ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి.
'ఎర్రోడు', 'దొరబాబు', 'ఓ తండ్రి.. ఓ కొడుకు', 'పల్నాటి పౌరుషం', 'బొబ్బిలి సింహం', 'సుబ్బు', 'టైగర్ హరిశ్చంద్రప్రసాద్'
తదితర సినిమాలకు ఆయన పాటలు రాశారు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలోని 'పుణ్యభూమి నాదేశం నమోనమామి' పాట
ఇప్పటికీ శ్రోతలు పాడుకొంటూనే ఉన్నారు. 'ఎర్రమందారం' సినిమాకి ఆయన రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకొన్నారు.
జాలాది మృతిపట్ల దాసరి నారాయణరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ''జాలాది నాకు
ఆత్మీయుడు. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'లో ఆయన మంచి పాటలు రాశారు. జానపదాలను వెండి తెర ద్వారా జనపదంగా
మార్చిన జనం కవి ఆయన'' అని చిరంజీవి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీ రచయితల సంఘం
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. జాలాది అంత్యక్రియలు శనివారం నిర్వహించేందుకు కుటుంబ
సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.