విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకుని.. ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత వీరమాచనేని మధుసూదనరావు
(88) బుధవారం కన్నుమూశారు. దాదాపు పదేళ్ల నుంచి అనారోగ్యంతో దర్శకత్వానికి దూరమైన ఆయన.. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్
జర్నలిస్టు కాలనీలోని తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.
1923లో కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో రామభద్రయ్య, అన్నపూర్ణలకు రెండో కుమారుడిగా జన్మించిన మధుసూదనరావు.. ప్రముఖ
దర్శకుడు కేఎస్ ప్రకాశరావు వద్ద శిష్యరికం చేసి, 1959లో తొలిసారిగా సతీ తులసి చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వా త ఆరాధన,
గుడిగంటలు, రక్తసంబంధం, జమీందారు, అదృష్టవంతులు, ప్రజానాయకుడు, భక్తతుకారాం, ఇద్దరూఇద్దరే, జేబుదొంగ, ఈ తరం మనిషి లాంటి
అనేక హిట్ సినిమాలను తెలుగు తెరకు అందించారు.
విద్యార్థి దశలోనే ఆయన స్టూడెంట్ యూనియన్ నేతగా ఉండేవారు. ప్రజానాట్యమండలితో అనుబంధం ఎక్కువ. తెలుగులో మొత్తం 72
సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 60 సూపర్ హిట్లు. అక్కినేని నాగార్జున, జగపతి బాబు, రమేష్‌బాబు లాంటి వారితో పాటు ఎం
తోమందిని తెలుగు సినీ ప్రపంచానికి హీరోలుగా పరిచయం చేసింది కూడా విక్టరీ మధుసూదనరావే. 1983 జనవరి 26న హైదరాబాద్‌లో సినీ
రంగంలోని వివిధ విభాగాలలో శిక్షణ ఇచ్చేందుకు మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు.
ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఎంతోమంది ప్రముఖ దర్శకులుగా, హీరోలుగా ఎదిగారు. హిందీలో మూడు, కన్నడంలో రెండు సినిమాల కు
దర్శకత్వం వహించిన మధుసూదనరావుకు 1997లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. 1982లో ఆయన నంది అవార్డుల కమిటీలో
సభ్యుడుగా పనిచేశారు. ఈయనవద్ద పనిచేసిన 57 మంది అసిస్టెంట్ డైరెక్టర్లలో చాలామంది తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకులుగా ఎదిగారు.
వీరిలో చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, రాంచందర్‌రావు, కేఎస్ రెడ్డి, మురారి తదితరులున్నారు.
మధుసూదనరావుకు వీణ, వాణి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఈయన మనవరాలు నీలిమ మాత్రమే మధుసూదనరావుకు వారసురాలిగా
సినీరంగంలో ప్రవేశించారు. జగపతిబాబు సరసన 'మా నాన్న చిరంజీవి' అనే సినిమాలో హీరోయిన్‌గాను, 'అధినేత' చిత్రంలో మరోపాత్ర
పోషించారు. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, భవాని, శేఖర్‌బాబు, కామేశ్, కాదంబరి కిరణ్‌కుమార్ తదితరులతో పాటు పలువురు
ప్రముఖులు మధుసూదనరావు భౌతిక కాయానికి తమ కడపటి నివాళి అర్పించారు. అంత్యక్రియలు ఈఎస్ఐ శ్మశాన వాటికలో గురువారం
నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మధుసూదనరావు మృతికి సినీహీరో, పీఆర్పీ ఎమ్మెల్యే చిరంజీవి సంతాపం తెలిపారు.