సినీన్యూస్
 
 
 
 
 
త్రిపురనేని మహారథి కన్నుమూత
ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి శుక్రవారం తెల్లవారు జామున అయిదు గంటలకు హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మహారథికి భార్య కమలతో పాటు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన రచయిత మహారథి. కథ, కథనం, సంభాషణ... ఏదైనా తన మార్కు కనిపించాల్సిందే. దాదాపు 150 సినిమాలకి ఆయన పని చేశారు. పలు పుస్తకాల్ని రచించారు. చిత్ర నిర్మాణంలోనూ ప్రవేశించి తన అభిరుచిని చాటుకొన్నారు. కృష్ణా జిల్లా పసుమర్రులో 1930 ఏప్రిల్‌ 20న ఓ జమిందారీ కుటుంబంలో ఆయన జన్మించారు. అసలు పేరు త్రిపురనేని బాలగంగాధర రావు. తండ్రి మరణానంతరం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతో తన పద్నాలుగోయేటనే వ్యవసాయం కోసం నిజామాబాద్‌ జిల్లా ధర్మారం చేరుకొన్నారు. అక్కడే బంజరు భూముల్ని సాగు చేసి కుటుంబాన్ని పోషించారు. తన తోబుట్టువులకు పెళ్లిళ్లు చేశారు. సాహిత్యంపై ఉన్న మక్కువతో ఆయన హైదరాబాద్‌ నగరానికి వచ్చి జమీన్‌ రైతు, గోల్కొండ, తెలుగుదేశం అనే పత్రికల్లో పాత్రికేయులుగా పనిచేశారు. అనంతరం రేడియో స్టేషన్‌లో ఉద్యోగం నిమిత్తం చెన్నై వెళ్లారు. అక్కడే సినీ పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. వివిధ భాషల్లో పట్టున్న మహారథి తొలినాళ్లల్లో పలు అనువాద చిత్రాలకి రచయితగా పనిచేశారు.

మహారథి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'తెలుగు సమాజం ఒక గొప్ప రచయితని కోల్పోయింద'ని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 'పదునైన కలం కలిగిన రచయిత మహారథి. ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోట'ని భాజపా జాతీయ నాయకులు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. 'తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎనలేనివ'ని తెదేపా అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 'జనచైతన్యం కోసం పాటుపడిన రచయిత' అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, భాజపా రాష్ట్రఅధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. 'సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రకం.. ఇలా అన్నిరకాల చిత్రాలకి పనిచేసిన గొప్పదనం మహారథికే దక్కుతుంద'ని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పద్మాలయ సంస్థతో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని జి.ఆదిశేషగిరిరావు తెలిపారు.