తెలుగు చిత్రపరిశ్రమ మరో ప్రతిభావంతుణ్ణి కోల్పోయింది. ముళ్లపూడి వెంకటరమణ మరిలేరు అనే విషయం సాహితీ ప్రియులకే కాదు సామాన్య ప్రేక్షకులచేత
కూడా కంటతడి పెట్టిస్తుంది. మూసకట్టు ఒరవడిని పక్కన పెట్టి కొత్తరకంగా కథలు అవి రాసేసిన రమణని పట్టుకుని, పనిగట్టుకుని సినిమారంగానికి
తీసుకువచ్చేశారు కొంత మంది నిర్మాతలు. సినిమా అంటే దృశ్యప్రధానం కానీ శ్రవణ ప్రధానం కాదని నమ్మడమే కాదు అక్షరాలా ఆచరించి చూపారు. సినిమా
షూటింగ్‌కు ముందే పూర్తి స్క్రిప్ట్ తయారు చేయడం రమణకి అలవాటు. సొంత సినిమా అయినా, బయట నిర్మాత సినిమా అయినా అదే పద్దతి.
సొంత సినిమా నిర్మాణసమయంలో ప్రొడక్షన్, బిజినెస్ చూడాల్సి వస్తుంది కనుక ముందే స్క్రిప్ట్ తయారు చేసేవారు. ఒకసారి రాసిన తర్వాత షూటింగ్
స్పాట్‌లో దాన్ని మార్చే అవసరం వచ్చేది కాదు. బయట చిత్రాలకు రాస్తున్నప్పుడు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న
'శ్రీరామరాజ్యం' సినిమా స్క్రిప్ట్ కూడా నిర్మాతకు ముందే అందచేశారు రమణ. విజువల్‌గా, అందంగా ఎలా చెప్పడం అన్నది ఊహించి సంభాషణలు రాసేవారు.
కథకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా రమణ తన రచనాసామర్ధ్యాన్ని ప్రదర్శించినా ఆయన పేరు ఇప్పటికీ జనం నోళ్లలో నానడానికి
కారణం సినిమాలే అని చెప్పాలి. వెకిలితనమే హాస్యంగా చెలామణి అయినరోజుల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన కలం రమణది. ఆయన హాస్యం పన్నీ
రు చిలకరించినట్లుగా ఉంటుంది. ఇక వ్యంగమైతే చురుక్కుమనిపిస్తుంది. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు తెలుగు, హిందీ, ఆంగ్ల చిత్రాల సమీక్షకుడిగా
ఒక చరిత్ర సృష్టించారు. సినిమా తీసినవారి గతచరిత్ర ఎంత ఘనంగా ఉన్నా నిర్భయంగా విమర్శిస్తూ, తమాషాగా చురకలు వేస్తూ సమీక్షలతో పాఠకులకు
చేరువయ్యారు.
ఇక సినీ రచయితగా రమణ సృష్టించిన పాత్రలు, మాటలు విలక్షణీయమైనవి. 'మడిసన్నాక కూసింత కలాపోసణుండాల, ఊరికే తిని తొంగుంటే మడిసికీ
గొడ్డుకీ తేడా ఏటుంటాది' అని 'ముత్యాలముగ్గు' చిత్రంలో కంట్రాక్టర్‌తో పలికించిన మాట తెలుగు సినిమా ఉన్నంతవరకూ ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. సినిమా
డైలాగులు ఓ రికార్డుగా రావడమన్నది ఈ సినిమాతోనే మొదలైంది. అలాగే 'గోరంతదీపం' చిత్రంలో కూతురు అత్తవారింటికి వెళుతుంటే తండ్రి చెబుతాడు '
నువ్వు హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో.. చూడ్డానికి రా.. ఓడిపోతున్నప్పుడు , కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే
అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి' అని. అలాగే 'గుడిగంటలు' చిత్రంలో మరో మంచి డైలాగు ఉంది.
'పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికి, సంతోషానికి పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది. ఈనాడు మనసారా మీకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం గాఢమైనది. అది హృదయంలో పుడుతుంది. అక్కడే ఉంటుంది. పెదవుల దాకా రాదు'. రమణ తొలి చిత్రం 'దాగుడుమూతలు' అయినా విడుదలైన తొలి సినిమా మాత్రం 'రక్తసంబంధం'. పుస్తకజ్ఞానం తప్ప ప్రపంచజ్ఞానం తెలియని వాళ్లు ఎలా మాట్లాడతారో 'దాగుడుమూతలు' చిత్రంలో పద్మనాభం పాత్రద్వారా
చెప్పించారు. 'తాతయ్యకు బోల్డు ఆస్తి ఉండును. దానిని వాళ్లు మనుమలకు ఇచ్చేదరు. అంతవరకూ మనము అమ్మడిని పెళ్లి చేసుకోరాదు అని అమ్మ
చెప్పును'... ఈ డైలాగులన్నీ జీవనసత్యాలే. అలాగే 'భక్త కన్నప్ప' సినిమాలో మరో డైలాగు ఉంది... ' శివుని మూడో కంట భగ్గుమనే మంటా ఉంది, ఓదార్చే
వెన్నెలా ఉంది.
అసలు మూడో కన్ను శివుడికే కాదు జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లో వెలుగు. మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో. ఎదుటివాడి గొప్పనే తెలుసుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది దీపం పెద్దదవుతుంది. దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరికన్నా గొప్పది...' ఈ డైలాగు ఆ చిత్రంలోని ఆ పాత్రకే కాదు ఎప్పుడైనా ఎవరికైనా వర్తిస్తుంది.
అదే విధంగా 'వాడికి డబ్బు చేసింది', 'ఆశ్చర్యపడి పోయి లేచాను', 'నీకు ధనబద్ధకం' 'దాఋణం', ' తుత్తి' 'ఆమ్యాయ్యా', 'తీతా'(తీసేసిని తాసిల్దార్) వంటి కొత్త పదాలను సృష్టించిన ఘనత రమణదే. నవ్వితే తమ స్టేటస్‌కి భంగం అనుకునే మేధావులను సైతం ఎలాంటి భేషజాలూ లేకుండా నవ్వించిన కలం
ఆయనది. తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులందరి చిత్రాలకు రచన చేశారు రమణ. ముఖ్యంగా ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో ఆయనకు అనుబంధం
ఎక్కువ. అక్కినేని జీవిత కథను 'కథానాయకుడి కథ' పేరుతో పుస్తకరూపంలో తెచ్చారు రమణ.
అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు, రమణతో వీడియో పాఠాలు తయారు చేయించారు. అలాగే కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' చిత్రానికి రమణే రచయిత. హీరోగా కృష్ణ ఎదుగుతున్న దశలో తమ తొలి సినిమా 'సాక్షి'లో మంచి అవకాశం కల్పించి ఆయన కెరీర్‌కు పటిష్టమైన పునాది ఏర్పరచారు. అదే విధంగా శోభన్‌బాబుకు 'సంపూర్ణరామాయణం' చిత్రాన్ని, కృష్ణంరాజుకు 'భక్త కన్నప్ప' చిత్రాన్ని అందించి వారి స్థాయిని పెంచారు బాపు, రమణ.
బాపు బొమ్మకి మాటలు నేర్పిన వాడు రమణ అయితే, రమణ మాటలకు రూపం ఇచ్చిన వ్యక్తి బాపు. బాల్యంలో ఏర్పడిన వీరి స్నేహబంధం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్నేహం అనేది వ్యాపారాత్మకం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి అతీతంగా ఉంటూ తమ స్నేహం గురించి వారు చెప్పుకోకుండా,
ఇతరులు చెప్పుకునే స్థాయిలో వారి స్నేహబంధం ఉంది. బాపు బొమ్మయితే, రమణ బొరుసు. మరి అటువంటి ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయిన బాపుని
ఓదార్చడం ఎవరి తరం!