సినీన్యూస్
 
 
 
 
 
గజల్ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా ‘నాట్స్’ సంబరాలు
ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ట్రైవ్యాలీ యూనివర్సిటీ మోసాలకు బలైపోయిన విద్యార్థులను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ నినాద లక్ష్యంతో పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్)సాంస్కృతిక సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, పద్మభూషణ్ నూకల చిన సత్యనారాయణ, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్, రంగస్థల నటుడు చాట్ల శ్రీరాములు, కూచిపూడి నృత్యగురువు ఉమారామారావులకు జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు. పదివేల రూపాయల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్లి, అక్కడి సంస్థల చేతిలో మోసపోయిన అభ్యర్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నాట్స్ డెరైక్టర్ మధు కొరప్రాటి మాట్లాడుతూ మాస్ట్రో గజల్ శ్రీనివాస్‌ను నాట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్వీ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో నగర మేయర్ కార్తీకరెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ కె.వరప్రసాదరెడ్డి, సన్‌షైన్ ఆసుపత్రి ఎండీ ఏవీ గురువారెడ్డి, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, లామ్‌కో చైర్మన్ సారిపల్లి కొండలరావు, నాట్స్ డెరైక్టర్లు ఆచంట గోపి, కోనేరు రవి, తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన సంబరాలు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాంస్కృతిక సంబరాలు అంబరాన్ని అంటాయి. సినీనటి జయలక్ష్మి నాట్యం రసజ్ఞులను రక్తికట్టించింది. నృత్యగురువు వెంకట్ ప్రదర్శించిన ‘అర్థనారిశ్వరం’ ఆసాంతం ఆకట్టుకుంది. నటీనటులు కృష్ణుడు, గౌతంరాజు, కోట శంకర్‌రావు, వేణు, ఢిల్లీ రాజేశ్వరి, జయలక్ష్మి, సౌమ్యరాయ్, గీతాసింగ్‌ల బృందం వినిపించిన హాస్యవల్లరి నవ్వించాయి. గీతామాధురి, శ్రీకృష్ణ, అంజనా, సౌమ్య, రేవంత్, సింహ, అనూప్, మాళవికల బృందం గీతాలాపన శ్రోతల మదిని దోచుకుంది. నాగరాజు ఆలపించిన వేణుగానం, ఫన్‌మాధవ్ స్టాండప్ కామెడీ అలరించాయి.

ఉత్తర అమెరికాలో తెలుగు నేస్తం...
ఆశలు, ఆశయాలు మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తాయి. పరాయి దేశంలో అడుగిడిన తర్వాత అక్కడంతా కొత్తగా... కాస్త వింతగా కనిపిస్తాయి. అంతా అలవాటయ్యేలోపు ఒడిదుడుకులు తప్పవు. అలా ఉత్తర అమెరికాలో వుంటున్న తెలుగువారికి చేదోడు వాదోడుగా వుండేందుకు ఆవిర్భవించింది. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్). అక్కడి తెలుగు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో సహకరించడం... ప్రమాదాలు, ప్రాణనష్టం జరిగిన సందర్భాల్లో ముందుండి సహాయ సహకారాలు అందించడం దీని లక్ష్యం. అత్యవసర సమయాల్లో 24గంటల పాటు పనిచేసేలా ‘1- 888-4-తెలుగు’ పేరుతో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సైతం ప్రారంభించారు. సాంస్కృతికోత్సవాలను భాగ్యనగరిలో నిర్వహించేందుకు వచ్చిన ఈ సంస్థ సంచాలకులు మధు కొర్రపాటి, వల్లభనేని యుగంధరరావు చెప్పిన విశేషాలు....

ఇప్పటికే నాట్స్ ఉచిత వైద్య శిబిరాలను, బోన్ మెరో డ్రైవ్ లను నిర్వహించింది. మనవారిలో చాలామంది మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని గుర్తించారు. వీరిలో చాలామంది నిరుద్యోగులు, విద్యార్థులు, స్వదేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులు వున్నారు. హైదరాబాద్లోని సన్ షైన్ ఆసుపత్రి సౌజన్యంతో జీవితకాల సభ్యులకు తక్కవు ఖర్చుకే వైద్యం అందిస్తోంది. విదేశాల్లో ఉద్యోగులుగా స్థిరపడాలనుకునే వారి కోసం కొన్ని నగరాల్లో ‘కెరీర్ అసిస్టెంట్’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు మాట్లాడేవారి కోసం ప్రత్యేకంగా ఇమిగ్రేషన్ సహాయాన్ని సైతం ప్రారంభించింది. ఆ దేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలు, ఇతరత్రా అంవాలపై అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఏ కారణంచేతనైనా ఉద్యోగం కోల్పోతే, ప్రత్యేక కోర్సులను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది... నాట్స్.

చదువుకోడానికి వెళ్ళాలనుకుంటే....
ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్ళేవారు క్షుణ్ణంగా వివరాలన్నీ తెలుసుకోవాలని మధు చెప్పారు. అభ్యర్థులు తాము చేరదలచుకున్న విశ్వవిద్యాలయం గురించి మందుగానే తమకు info@natsworld.org అన్న ఈమెయిల్ కు గానీ, 1-888-4-తెలుగు హెల్ప్ లైన్ లో గానీ తెలియజెప్పి అవసరమైన సలహాలు సూచనలు పొందవచ్చన్నారు. మోసపోయిన తర్వాత ఏమీ చేయలేం గనుక ముందుగానే అప్రమత్తంగా వుండాలంటున్నారు.

ఇక... ఇక్కడిలాగే అమెరికాలోనూ ఇబ్బడిముబ్బడిగా వర్శిటీలు, కళాశాలలు వున్నాయి. అక్కడ సైతం విద్య పేరుతో మోసాలు సాగుతున్నాయని వాపోయారు మధు. హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలుగా ఏజెంట్లను నియమించుకుని కొన్ని నకిలీ విదేశీ విద్యాసంస్థలు డబ్బులు దండుకుంటున్నాయని వాపోయారు.

పెళ్ళి సంబంధం చూస్తున్నారా?...
సొంతగడ్డపై పెళ్ళి చేసుకుని, అమెరికాలో కాపురం పెట్టిన తర్వాత కొందరు భర్తలు తమ భార్యలను వేధిస్తున్నారట. కొంతకాలం స్వదేశంలో కాపురం చేసి, వీసా పంపుతానంటూ అమెరికా చెక్కేసే ప్రబుద్దులూ లేకపోలేదు. అమెరికా సంబంధం అనగానే సంబరపడకుండా, పెళ్ళికి ముందే అబ్బాయి ఎవరన్న విషయాలు చెబితే... అతనికి సంబంధించిన విషయాలను చెబుతామంటున్నారు నాట్స్ నిర్వహకులు.