ప్రముఖ సినీనటుడు నూతన్ ప్రసాద్(61) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుక్రితం డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి
తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. 1973లో 'అందాల రాముడు'చిత్రంతో తెరంగేట్రం చేసిన నూతన్ ప్రసాద్ అనతికాలంలో నటుడిగా,
హాస్యనటుడిగా, ప్రతినాయుకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరి మన్ననలను పొందారు. 1950, అక్టోబర్ 10న కృష్ణా జిల్లా కైకలూరులో
జన్మించిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్, ఆయనకు ముగ్గురు సంతానం.
'ముత్యాల ముగ్గు' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. 'చలిచీమలు' చిత్రంలో 'నూటొక్కజిల్లాల' అందగాడు పాత్రతో మంచి పేరు
ప్రఖ్యాతలు సంపాధించిన నూతన్ ప్రసాద్ 'దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ' అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు.
1984లో 'సుందరి-సుబ్బారావు' చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1989లో 'బామ్మ మాట బంగారు
బాట' చిత్ర షూటింగ్‌లో ప్రమాదానికి గురైన ఆయన వీల్ చైర్‌కే పరితమయ్యారు. అనంతరం కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను
మెప్పించారు. ఇటీవల కాలంలో బుల్లి తెరపై పలు సీరియల్లలో వాయిస్ఓవర్‌గా చేస్తూ అందరినీ అలరించారు.
ఖైదీ, కథానాయకుడు, అహనాపెళ్లంట, శ్రీవారికి ప్రేమలేఖ, మగమహారాజు, రాజాధిరాజ, కర్తవ్యం, చలిచీమలు, ప్రెసిడెంట్ పేరయ్య, తాతయ్య
ప్రేమలీలు వంటి హిట్ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు నిచ్చాయి. 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని
ప్రధాన ఆడిటోరియాలకు బాపు నవరసాల చిత్రాలను ఆయన విరాళ ంగా అందజేశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.
ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.