సినీన్యూస్
 
 
 
 
 
నా సినిమాలన్నింటిలో హయ్యస్ట్ గ్రాసర్‌ ‘రాజన్న’
‘‘రాజన్న’ రెగ్యులర్ సినిమాకాదు. ఇందులో డ్యూయెట్లు లేవు. కామెడీ అంతకన్నా లేదు. ప్రథమార్ధం మొత్తం చిన్నపాపపై నడుస్తుంది. అలాంటి సినిమాను ఆదరించి ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు ఇలాంటి కథకు తెరరూపాన్ని ఇవ్వడం తేలికైన విషయం కాదు. ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు, అందులో నటించినందుకు గర్విస్తున్నాను. నా సినిమాలన్నింటికన్నా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘రాజన్న’. ఈ సినిమా విషయంలో మొదటథ్యాక్స్ చెప్పాల్సింది డెరైక్టర్ విజయేంద్రప్రసాద్‌కి. ఇది రాజమౌళి ముద్ర ఉన్న సినిమా అని చాలామంది అంటున్నారు. అందులో ఏ మాత్రం నిజంలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం విజయేంద్రప్రసాద్ ఆలోచనల నుంచి పుట్టిందే. రాజమౌళితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చేసిన ప్రతి సీన్ రెట్టింపు ఉత్సాహంతో తీసేవారాయన. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ఓ ఆభరణం. బాలనటి యాని నటన సినిమాకు వెన్నెముక. ప్రతి శాఖవారు మనసు పెట్టి పనిచేశారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాక మంచి పబ్లిసిటీ ఇచ్చి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు’ అని నాగార్జున అన్నారు.

విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం ‘రాజన్న’. గురువారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్‌మీట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున పై విధంగా స్పందించారు. ‘‘ఈ కథ తయారు చేయడానికి రెండేళ్లు పడితే... నాగార్జున గారికి చెప్పడానికి మరో రెండేళ్లు పట్టింది. కథ విని ఓకే చెప్పేముందు నాగార్జున ఓ అయిదు సెకండ్లు మౌనం వహించారు. ఆ అయిదు సెకండ్లు నాకు అయిదు యుగాలుగా అనిపించింది. నాగేశ్వరరావుగారి కళ్లు నాగార్జునగారికి వచ్చాయి. ఆయనలో లేని రౌద్రం కూడా నాగార్జునలో కనిపిస్తుంది. అది చూస్తే... నా ‘రాజన్న’ నా కళ్లముందు కనిపించినట్టు అనిపించింది’’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. రాజన్న మా చిన్నాన్న కల. దానికి మేమందరం రంగులద్దితే ఆ కలను నాగార్జున నిజం చేశారు’’ అని కీరవాణి అన్నారు.

మరో సావిత్రి దొరికింది
రాజమౌళి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నా ముద్ర కనిపిస్తుంది అంటున్నారు. నేను సినిమా గ్రామర్ నేర్చుకున్నదే మా నాన్నగారి దగ్గర. ముందు డెరైక్టర్ అయ్యాను కాబట్టి నా ముద్ర అంటున్నారు. కానీ అది విజయేంద్రప్రసాద్ మార్క్. యాని నటన నిజంగా వండర్. ఆమె నటన చూసి ఇండస్ట్రీకి మరో సావిత్రి, సూర్యకాంతం దొరికింది అనిపించింది’’ అన్నారు.

‘‘ఈ కథ ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్‌గారు విన్నప్పుడు ఎవరైనా పెద్ద హీరో చేస్తేనే కథకు న్యాయం జరుగుతుంది అన్నారు. నాగార్జున చేస్తున్నారని తెలిశాక ఆయన చాలా సంతోషించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయలేకపోయినా కనీసం డిస్ట్రిబ్యూట్ అయినా చేయాలని ఆయన ఆశించారు. అడగ్గానే నాగార్జున ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’ అని కె.అచ్చిరెడ్డి అన్నారు. ఇంకా అమల, అఖిల్, యాని, గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.