సూపర్ హీరోకు షష్టిపూర్తి
'రోబో' ఇటీవలి వెండితెర సంచలనం. భారతీయ సిల్వర్‌స్క్రీన్ మీద మునుపెన్నడూ పెట్టనంత ఖర్చుపెట్టి తీర్చిదిద్దిన చిత్రం. 'సినిమా అంతా ఒక ఎత్తు. 'రోబో'లో రజనీకాంత్ విసిరిన నవ్వు ఒక ఎత్తు...' అని సినీ విమర్శకులు విస్మయాన్ని వ్యక్తం చేసింది సూపర్‌స్టార్ రజనీని చూసే. ఆరు పదుల వయసులోనూ అరనవ్వులతో జనాల్ని ఆకట్టుకున్న 'తలైవర్'(నాయకుడు) రజనీకి ఆదివారం పుట్టినరోజు. మరాఠీ కుటుంబంలో పుట్టిన రజనీ అప్పుడు శివాజీరావ్ గైక్వాడే. ఆయన్ని లాలించింది కన్నడ గడ్డ.

దేశమంతా గర్వంగా మావాడు అని చెప్పుకునే స్థాయికి రావడానికి అవకాశాలను కల్పించింది మాత్రం తమిళ పరిశ్రమ. 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ మరాఠీ వీరుడు కెరీర్ ప్రారంభంలో ప్రతినాయక పాత్రల్లో, మల్టీస్టారర్ చిత్రాలతోనూ మెప్పించాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన నటవిశ్వరూపాన్ని చూపించి 'మాస్' ప్రేక్షకుల చేత 'తలైవా' అని ముద్దుగా పిలిపించుకోవడానికి ఆయనకి ఇట్టే సమయం పట్టలేదు.

'మూండ్రు ముడిచ్చు', 'పదినారు వయదినిలే', 'బిల్లా', 'మురట్టు కాళై', 'దళపతి', 'బాషా', 'ముత్తు', 'అరుణాచలం', 'నరసింహ', 'చంద్రముఖి', 'శివాజీ', తాజాగా 'రోబో'... చిత్రాల క్రమం ఆయన్ని తమిళ నటుడు అనే ముద్ర నుంచి బయటకు లాగి దక్షిణాది నటుడిగా, భారతీయ నటుడిగా ప్రకాశింపజేశాయి. కెరీర్ ప్రారంభ దశలో రజనీకాంత్ నటించిన 'అంతులేని కథ', 'వయసు పిలిచింది', 'అన్నదమ్ముల సవాల్', అనంతర కాలంలో చేసిన 'పెదరాయుడు' చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.

'మీడియా పెరిగిపోయింది. మనం ఒక ఆలోచనతో ఏదో మాట్లాడతాం. మీడియా దాన్ని వేరే దృష్టితో చూస్తుంది. నా అభిమానులు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటారేమో. అంతెందుకు? అదేదో నేను నోరు విప్పకుండా ఉంటే మేలు కదా' అని ఓ సందర్భంలో అన్న రజనీ తీరికవేళల్లో పుస్తకాలతోనే ఎక్కువగా గడుపుతారు. గంభీరంగా కనిపించే రజనీ పసిపిల్లాడులా మారే క్షణాలూ ఉన్నాయి. మనవడు యాత్ర పోయస్‌గార్డెన్‌లో అడుగుపెడితే చాలు రజనీ గదిలో 'ఏమిరా..' అంటూ తెలుగు వినిపిస్తుంది. పెద్దకూతురు ఐశ్వర్యను చేసుకున్న ధనుష్ కుటుంబం తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. ఇప్పటికీ వారు ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారు.

అందుకే యాత్రతో రజనీ ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతారట. 'ఎదుటివారి వ్యక్తిగత జీవితంలో మనం తలదూర్చకూడదు. నిరాడంబరతను మించిన ఆభరణం మరొకటి లేదు' అనే సిద్ధాంతాల్ని ఆది నుంచీ అనుసరించే రజనీ భార్య లత నిర్వహిస్తున్న 'ఆశ్రమ్' పాఠశాల విషయంలో మరీ అవసరమైతే తప్ప సలహాలివ్వరట. ఆకర్ స్టూడియోను ఏర్పాటు చేసిన చిన్న కుమార్తె సౌందర్య ప్రస్తుతం రజనీకాంత్‌పై రూపొందిస్తున్న 'సుల్తాన్ ది వారియర్' యానిమేషన్ చిత్రం రజనీలోని మరెన్ని కోణాల్ని ఆవిష్కరిస్తుందో వేచి చూడాలి మరి.