ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు షమ్మీకపూర్ ఈరోజు ఉదయం ముంబయిలో కన్నుమూశారు. పాతతరం బాలీవుడ్ నటుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షమ్మీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల సంబంధ వ్యాధితో బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు ఝామున తుదిశ్వాస వదిలారు.
ప్రఖ్యాత రంగస్థల, సినీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముగ్గురు కుమారులలో షమ్మీ రెండోవాడు (రాజ్‌కపూర్, శశికపూర్ షమ్మీ సోదరులు). 1931 అక్టోబరు 21న ముంబయిలో ఆయన జన్మించారు. షంషేర్ రాజ్ కపూర్ షమ్మీ అసలు పేరు. ముంబయి రూయా కళాశాలలో కొంతకాలం చదువుకున్న షమ్మీ చదువు పూర్తి చేయకుండానే తండ్రి నిర్వహిస్తున్న పృథ్వీ థియేటర్స్‌లో జూనియర్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. 'జీవన జ్యోతి' చిత్రం ద్వారా 1953లో బాలీవుడ్ రంగప్రవేశం చేశారాయన. తెల్లగా, పొడుగ్గా, తనకే ప్రత్యేకమైన కంటి రంగుతో, స్త్టెలిష్ ప్లేబాయ్‌గా షమ్మీ కపూర్ కొద్దికాలంలోనే బాలీవుడ్ చిత్ర అభిమానుల మనసు దోచుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు రొమాంటిక్ హీరోగా హిందీ చిత్రసీమను ఏలిన షమ్మీ 1970ల తర్వాత స్థూలకాయం కారణంగా నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్‌కి మారారు. తనతో హీరోయిన్‌గా పనిచేసిన సైరాబానుకు తండ్రిగా సైతం నటించారాయన. షమ్మీకపూర్ 1968లో బ్రహ్మచారి సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. 1982లో విధాత సినిమాకు ఉత్తమ పోషక నటుడిగా ఫిలింఫేర్ పొందిన ఆయన 1995లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. తుమ్‌సా నహి దేఖా, దిల్ దేకే దేఖో, జంగ్లీ, ప్రొఫెసర్, దిల్ తేరా దీవానా, చైనా టౌన్, రాజ్‌కుమార్, కాశ్మీర్ కీ కలీ, జాన్‌వర్, తీస్రీ మంజిల్, యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్, అందాజ్ లాంటి ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
దర్శకుడిగా షమ్మీ మనో రంజన్, బందల్‌బాజ్ అనే రెండు చిత్రాలు తీశారు కానీ బాక్సాఫీసు వద్ద అవి విజయం సాధించలేకపోయాయి. సహనటి గీతాబాలిని షమ్మీకపూర్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆదిత్య రాజ్‌కపూర్, కంచన్. గీత మరణించిన తర్వాత గుజరాత్ రాజకుటుంబానికి చెందిన నీలాదేవిని షమ్మీ వివాహమాడారు.
ఇంటర్నెట్ యూజర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ అయిన షమ్మీ కపూర్ తమ కపూర్ కుటుంబం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ నిర్వహించేవారు.