సినీన్యూస్
 
 
 
 
 
సుజాత కన్నుమూత
విశిష్ట నటనతో దక్షిణాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ప్రముఖ సినీనటి సుజాత(58) బుధవారమిక్కడ స్వగృహంలో అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో చనిపోయారు. సుజాతకు భర్త జయకర్ హెన్రీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలి పారు. తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన సుజాత దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఆమె స్వస్థలం కేరళలోని ఎర్నాకులం జిల్లా మరదు. ఆమె పదో తరగతి వరకు చదువుకున్నారు. 1967లో 14 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం ‘తబస్విని’లో నటించారు. తెలుగులో ఆమె తొలిచిత్రం‘గోరింటాకు’(1979). ఈ చిత్రంలో నటనకుగాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, చిరంజీవి తదితర నటుల సరసన హీరోయిన్‌గా నటించారు. ఆమెను దర్శకుడు బాలచందర్ ‘అవళ్ ఒరు తొడర్ కథై’(1971-తెలుగులో అంతులేని కథ) చిత్రంతో తమిళ సినీరంగానికి పరిచయం చేశారు. ప్రముఖ రచయిత్రి రామలక్ష్మీ ఆరుద్ర సుజాతకు తెలుగు నేర్పించారు. నటి సరిత డబ్బింగ్ చెప్పేవారు. తెలుగులో తన చిత్రాల్లో ‘ఏడంతస్తుల మేడ’ తనకు నచ్చిన చిత్రమని సుజాత చెప్పేవారు. ఆమె చిత్రాలు సంధ్య, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, మంగమ్మ శపథం, పెళ్లి, చంటి, సూత్రధారులు, స్నేహం కోసం, బాబా జనాదరణ పొందాయి. సుజాత చివరి చిత్రం శ్రీరామదాసు. ఆమె మృతి సినీరంగానికి తీరని లోటని గోరింటాకు చిత్ర నిర్మాత మురారి అన్నారు. తన చిత్రానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. గోరింటాకు షూటింగు కోసం ఆమె తన నాలుగేళ్ల కుమారుడితో వ చ్చేవారని గుర్తు చేసుకున్నారు.