‘సినీ ఆణిముత్యాలు’పేరుతో సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా పసుపులేటి రామారావుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర ప్రముఖలు మురళీమోహన్, పోకూరి బాబూరావు, ముత్యాల సుబ్బయ్య, ఏడిద నాగేశ్వర్రావు, సీనియర్ పాత్రికేయులు మోహన్‌కుమార్, ఏడిద నాగేశ్వర్రావు, మాదాల రవి, రేలంగి నరసింహారావు, ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. నిజాయితీ నిబద్దతలతో తన వృత్తిలో ఇన్నేళ్లుగా రాణిస్తూ.. అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ, వివాదరహితుడిగా పేర్గాంచిన పసుపులేటి.. తన వృత్తిలో భాగంగా పలువురు ప్రముఖులను చేసిన ఇంటర్వ్యూలలో అతి ముఖ్యమైన ఇంటర్వ్యూలను ఎంపిక చేసి, ఎంతో విలువైన సమాచారాన్ని పొందుపరుస్తూ చేసిన ప్రయత్న ం ఎంతైనా అభినందనీయమని దాసరి అన్నారు.
ప్రతి సినిమా జర్నలిస్ట్ తన అనుభవాలన్నిటికీ అక్షరరూపం కలిగిస్తూ పుస్తకాన్ని వెలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాసరి అన్నారు. సినిమా జర్నలిస్టులందరికీ ఉపయోగపడేలా.. తెలుగు సినిమాపై వెలువడిన పుస్తకాలన్నీ సేకరించడంతోపాటు.. సినిమా పత్రికలన్నిట్నీ ప్రారంభ సంచికలనుంచి సేకరించి ఒక మంచి లైబ్రరీ తయారు చేసేందుకు తాను సంకల్పిస్తున్నాని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పుస్తకరచయిత పసుపులేటి రామారావు మాట్లాడుతూ.. తనను మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చిన దాసరి, మోహన్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. |