‘‘ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’’ బాలు

'కుటుంబాన్ని పోషించుకోడానికీ.. అనుకోకుండా సంగీతం అనే వృత్తిని స్వీకరించాను. మీరంతా అనుకుంటున్నట్లు నేను ఎవరి కోసమో పాడటం లేదు. నాకోసం నేను పాడుకుంటున్నాను. బతికున్నంత కాలం మంచి పాటలు పాడాలి. ఓపికపోయిన రోజు పాడకుండా ఉండాలనే గమ్యంతో జీవిస్తున్నానని' పద్మశ్రీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో ఆయనకు ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కార ప్రదానోత్సవం బుధవారం రవీంద్రభారతి వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ స్పందిస్తూ.. బాలు బాగా పాడాడు.. అదరగొట్టాడు అన్నప్పుడు పొంగిపోలేదు. పరిశ్రమలో ఎవరూ లేరా.. మరొకరికి అవకాశం ఇవ్వడం లేదని అన్నప్పుడు కుంగిపోలేదని అన్నారు. పరిపూర్ణత అనేది ఏ కళకు లేదన్నారు. ఇది తుదిలేని జీవనహేళగా ఆయన అభివర్ణించారు. నేను ఏ గురువు దగ్గరా సంగీతంలో ఓనమాలు దిద్దలేదు. నాతో పని చేయించుకున్న వారందరి ద్వారా ఎంతో నేర్చుకున్నానని, బుల్లితెరపై ప్రసారం అవుతున్న 'పాడుతా.. తీయగా' కార్యక్రమం ద్వారా చిన్నారుల నుంచీ ఎంతో నేర్చుకునే అవకాశం కలిగిందని ఎస్పీ తనదైనశైలిలో స్పందించారు. నా బలహీనతేంటో.. నా శక్తి ఏంటో నాకు తెలుసు. నా దృష్టిలో వీలైనంత తక్కువ తప్పులు చేసిన వాడే గొప్పవాడవుతాడని అన్నారు.

పైరసీని అరికట్టండి...

ఇష్టమైతేనే సినిమాకు వెళ్లండి... అంతేగానీ పైరసీని ఆశ్రయించకండి అని ఎస్పీ విన్నవించారు. పది రూపాయల సీడీ కొంటున్నప్పుడు ఒకరి పొట్టకొడుతున్నామని గుర్తుంచుకోండి. చౌకగా వస్తుంది కదా.. అని చౌకబారుతనానికి దిగజారకండి అని ప్రజలకు సూచించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా.అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచమే గర్వించదగ్గ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడుకావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. నిండైన మనిషి, ఎదగకుండానే ఒదిగిపోయిన బాలు భావితరాలకు స్ఫూర్తి అన్నారు. డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. బాలు అనేక భారతీయ భాషల్లో పాటలు పాడి ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అవార్డుకు సార్థకుడయ్యాని చెప్పారు. పద్మశ్రీ డా.శోభానాయుడు ప్రసంగిస్తూ సంగీత ప్రపంచంలో ఎస్పీ ప్రభంజనాన్ని సృష్టించారని అన్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. బాలు ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా కాదు.. వరల్డ్‌ సినిమా అని కితాబునిచ్చారు. సభలో కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నటుడు కైకాల సత్యనారాయణ, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు కోటి, మాధవపెద్ది సురేశ్‌, సీనియర్‌ జర్నలిస్టు వాశిరాజు ప్రకాశం, ఎస్‌.కొండలరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా గాయనీ, గాయకులు వినోద్‌బాబు, కె.రామాచారి, విజయలక్ష్మీ, దుర్గ, వి.వి.రామారావు, యశస్వీలు సమర్పించిన బాల సుబ్రహ్మణ్యం గానలహరి శ్రోతల మది దోచింది.

 
 
 
 
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com