కల్చరల్
 
 
 
 
డా.దాశరథి కృష్ణమాచార్య కవితల ఆవిష్కరణ
డా.దాశరథి రంగాచార్య సాహితీ ప్రస్థానం సుదీర్ఘమైనది, మహోజ్వలమైనదని ఉపన్యాసకులు శ్లాఘించారు. ఆయన ప్రజలకు వేదం అనే నినాదంతో నాలుగు వేదాలను తెలుగు వెన్నెల వచనంలో అనుశృతించిన ఆద్యుడని కొనియాడారు. 12ఏళ్ల ప్రాయంలోనే ప్రజాపోరాటానికి అంకితమైన ఆయన 1946-51 సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయగానసభ సదనంలో నిర్వహించిన అక్షరవాచస్పతి డా.దాశరథి రంగాచార్య 84వ జన్మదిన వేడుకలో వారు అతిథి ప్రసంగాలుచేశారు. ఈ సందర్భంలో డా.దాశరథిరంగాచార్య, కమలమ్మ దంపతులను ఘనంగా సత్కరించారు. డా.రంగాచార్య సోదరుడైన దివంగత డా.దాశరథి కృష్ణమాచార్య సమగ్రసాహిత్యం రెండో సంపుటాన్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత కవి ఇక్భాల్‌ కవితలకు డా.రంగాచార్య అనుసృజన వ్యాఖ్యాలతో వెలువరించిన ఇక్భాల్‌ కవితల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ముఖ్యఅతిథి దక్షిణాది దూరదర్శన్‌ కేంద్రాల సలహాదారు డా.పి.మధుసూదన్‌ ప్రసంగిస్తూ- డా.దాశరథి రంగాచార్య, కృష్ణమాచార్య సోదరులు సాంప్రదాయ వాదులు, సామ్యవాదులు, ఆధునికులు, మానవతావాదులు, ఉదారులు, దార్శనికులు, భాగవతోత్తములుఅన్నారు. ప్రముఖరచయిత్రి డా.మృణాళిని అధ్యక్షోపన్యాసం చేస్తూ -దాశరథి సోదరుడు తెలుగు, ఉర్దూ భాషలను నేత్ర ద్వయంగా పరిగణించారన్నారు. గ్రంథావిష్కర్త తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షురాలు డా.ఆవుల మంజులత మాట్లాడుతూ -రంగాచార్య నరున్ని మానవున్ని చేసే లక్ష్యంతో సాహితీ వ్యాసాంగం సాగించారన్నారు. విశాలాంధ్ర ప్రచురణాలయం మేనేజర్‌ బీమిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ తమ సంస్థ డా.దాశరథి రంగాచార్య సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తున్నదన్నారు. ' కార్నేషన్స్' సీఈఓ డా.రామ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

డా.రంగాచార్య స్పందన ప్రసంగం చేస్తూ- తన సోదరుడు దాశరథి కృష్ణమాచార్యకు ఘననివాళులు అర్పించారు. ఆయన గ్రంథాన్ని తన జన్మదిన వేడుకలో ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా తెలుగు భాషను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యమన్నారు. యువకళవాహిని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువకళావాహిని అధ్యక్షుడు వైకె నాగేశ్వరరావు, కార్యదర్శి మల్లికార్జునరావు, నర్సింహారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.