సినిమా పోస్టర్ డిజైన్‌లో పేరొందిన కళాకారుడు ఈశ్వర్. ఒకప్పుడు సినిమా పోస్టర్‌కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
కొన్ని సంవత్సరాల క్రితం గ్రామాల్లో ఏ సినిమా వస్తుందా అన్న...ఆసక్తితో పోస్టర్‌ను చూడటానికి ఎగబడేవారు. ఇది ఇంతగా
ఆకర్షణీయంగా రూపొందడానికి కారణం, వాటిని డిజైన్ చేసిన ఈశ్వర్. సినిమాలకు టైటిల్స్, నటీనటులకు పబ్లిసిటీ
రావాలంటే సినిమా పోస్టరే ఆధారం. వీటిపై ఆయన వేసిన బొమ్మలే గోడలపై వుండేవి.
దాదాపు పలు బాషల్లో 2000కుపైగా చిత్రాలకు ఈశ్వర్ పనిచేశారు. సినిమాలపై, పోస్టర్ డిజైన్‌పై ఎంతో
అనుభవమున్న ఆయన ఈనాటి తరానికి తెలియజేస్తూ 'సినిమా పోస్టర్' పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆదివారంనాడు
ఫిలింఛాంబర్‌లో దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని డా|| డి. రామానాయుడుకు అందజేశారు. మలి ప్రతిని
సీనియర్ జర్నలిస్టు బి.ఎ.రాజు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి చెన్నైనుంచి సినిమారంగానికి చెందిన పలువురు
హాజరయ్యారు. గొల్లపూడి మారుతీరావు, మురారి, ప్రమోద్‌కుమార్, రవికిషోర్, మోహనరావు, విశ్వనాథరెడ్డి, అశ్వనీదత్,
కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, భరణి తదితరులు హాజరయ్యారు.తొలి ఉపన్యాసాన్ని గొల్లపూడి మారుతీరావు
చెబుతూ...'నలభై ఏళ్ళ కెరీర్‌లో నిర్మాతలతోనూ, దర్శకులతోనూ ఎలాంటి వివాదాలులేకుండా పనిచేయడం గొప్ప విషయం.
ఎన్నో కష్టాలను తట్టుకుని ఈ రంగంలో నిలబడ్డారు. తొలినాళ్లలో అన్నానికి కూడా నోచుకోని
సందర్భాలున్నాయంటే...ఆయన మనో ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపించింది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు'నని
అన్నారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ...'ఎంతోమందిని సత్కరిస్తుంటాం. కానీ తెర వెనుక ఉండి కనిపించని డిపార్ట్‌మెంట్
పోస్టర్ డిజైనింగ్. మూడు గీతలతో జనానికి కనిపించిన కళాకారుడు ఈశ్వర్. భావితరాల వారికి ఆయన అనుభవాన్ని
రంగరించి పుస్తకం రూపం తెచ్చారు. నేను, ఆయన ఒకే ఊరిలో పుట్టాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. మా స్కూల్‌కు 100
సంవత్సరాలు, స్కూల్ మేగజైన్‌కు 60 ఏళ్ళు నిండితే ఈశ్వర్‌గారే కవర్ పేజీ చేశారు. గవర్నర్ ప్రశంసలు అందుకున్నారు.
ఈశ్వర్ ప్రయత్నిస్తే దాసరి అంత దర్శకుడు కాగలడు. కానీ దాసరి మాత్రం ఈశ్వర్ అంతటి కళాకారుడు కాలేదు. కేతుగారి
తర్వాత ఈశ్వర్ జనరేష్. ఎంతోమంది శిష్యులను తయారుచేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా కంప్యూటర్‌మయం.
కుంచెకు పని తగ్గింది. అందుకే ఆయన రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఈ పుస్తకాన్ని నిర్మాతలు చదివితే ఎంతో
ఉపయోగకరంగా ఉంటుంది' అని అన్నారు.
ఈశ్వర్ స్పందిస్తూ...'పబ్లిసిటీకి మూలం కరపత్రాలు. ఇది కాస్తా పోస్టర్‌గా అవతరించింది. ఆ రోజు మౌత్ టాక్‌గా
ప్రారంభమై పబ్లిసిటీ కొత్తపుంతలు తొక్కింది. కాలంతోపాటు పోస్టర్ విధానం మారింది. ఈ పుస్తకం కోసం మూడు
సంవత్సరాలు కృషి చేశాను. నాకు ఎంతో సహకరించిన స్నేహితులకు, విజయా పబ్లికేషన్ విశ్వనాథ్‌రెడ్డికి కృతజ్ఞతలు
తెలియజేసుకుంటున్నా'నని అన్నారు.