ఇవివికి అల్లు జాతీయ పురస్కారం

పద్మశ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా, ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి బాబూమోహన్, హాస్య నటుడు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, దర్శకులు వీవీ వినాయక్, కోడి రామకృష్ణ, నటులు నాగబాబు, చలపతిరావు, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అల్లు జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈవీవీ చేతికి దాసరి స్వర్ణకంకణాన్ని తొడగగా, ఎంపీ వీహెచ్ కిరీటాన్ని పెట్టారు. అనంతరం శ్రీకాంత్ కుమార్ రచించిన ‘డాక్టర్ అల్లు రామలింగయ్య జీవన చిత్రం- ఇది ముగింపు లేని కథ’ పుస్తకాన్ని నటుడు రామ్‌చరణ్ ఆవిష్కరించారు.

‘దేశంలోని అన్ని పార్టీలకన్నా, శక్తిమంతమైన పార్టీ కాంగ్రెస్సే. పద్మశ్రీ అల్లు రామలింగయ్య కూడా ఒకప్పడు కాంగ్రెస్ అభిమానే. చిరంజీవి కూడా మా పార్టీలో చేరతాడని నేను భావించాను. కానీ సొంతంగా ఆయన ఓ పార్టీ పెడతాడని నేను ఊహించలేకపోయాను’అని ఎంపీ వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు చిరంజీవి అభిమానులు, ప్రజారాజ్యం కార్యకర్తలు వీహెచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అడ్డుతగిలారు. వేదికపై ఉన్న నటుడు అల్లు అర్జున్ లేచి నిలబడి.. సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అంతకుముందు దాసరి నారాయణరావు మాట్లాడుతూ పద్మశ్రీ అల్లు రామలింగయ్య తన హాస్యంతో అందరినీ కడుపుబ్బా నవ్వించేవాడని చెప్పారు. ఆయన పంచిన హాస్యం కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉండేదన్నారు. దేశంలోని సినీపరిశ్రమలన్నీ నటీనటులను దిగుమతి చేసుకుంటున్నా... తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటులకు కొదవలేదన్నారు. రంగస్థల నటుడిగా అల్లు తన కెరీర్‌ను ప్రారంభించారని, ఎస్వీ రంగారావు, సావిత్రిల తర్వాత చెప్పుకోదగ్గ నటుడు అల్లు రామలింగయ్య అని కొనియాడారు. ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్ తదితర హాస్య నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
 
 
 
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com