'అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి శాశ్వత వేదిక హైదరాబాద్ అయినప్పటికీ సంబంధిత మంత్రిత్వ శాఖకే ఈసారి ఇక్కడ
జరుగుతుందా అనే అనుమానం వచ్చింది. నేను ఇక్కడే జరుగుతుందని... అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పాను. రాష్ట్ర
ప్రభుత్వం ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని చ్రిల్డన్స్ ఫిలిం సొసైటీ కోసం కేటాయించింది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలను త్వరలోనే
చేపడతాం. రాబోయే 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆ ప్రాంగణంలోనే జరిగేలా తగిన చర్యలు తీసుకుంటాం. మరోమారు
చెబుతున్నాను.
అంతర్జాతీయ బాలల చలనచిత్స్రోవానికి హైదరాబాద్ శాశ్వత వేదికగానే ఉంటుంది' అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్
కుమార్ రెడ్డి. గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని
ప్రారంభించటానికి ముఖ్య అతిథిగా విచ్చేశారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం
మనది. దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ తరానిదే..' అని అన్నారు. ఇప్పుడు ఉన్న విస్తృతమైన పోటీలో చిన్నారులు
తమ క్లాస్ లేదా ఊరు లేదా రాష్ట్ర విద్యార్థులతోనే కాదు... ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తుందన్నారు.
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంతో ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కలిగిందన్నారు. పిల్లల కోసం తీసే
చిత్రాల వలన వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి, అదే సమయంలో ఆయా చిత్రాలను వారు పూర్తిగా ఆస్వాదించే రీతిలో ఉండాలి..
అని అన్నారు. ఈ సందర్భంగా తన చిన్న తనంలో తాను చూసిన 'లాస్ట్ ఇన్ ద డిసర్ట్' (తెలుగులో పాపం పసివాడుగా ఈ చిత్రం
పునర్మితమైంది), ఇటీవలి కాలంలో బేబీస్ డే ఔట్ (తెలుగులో ఈ చిత్రాన్ని నాగార్జున సిసింద్రీగా నిర్మించారు) చిత్రాలు తనకెంతో
ఇష్టమంటూ... ఇలాంటి చిత్రాల వల్ల పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా
రాష్ట్రంలో బాలల చలనచిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఉందన్నారు. బాలల చలన చిత్రాలను రూపొందించే వారి కోసం 30
లక్షల రూపాయల సబ్సిడీను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.
అంతకు ముందు చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఎఫ్ఐ) ఛైర్ పర్సన్ నందితా దాస్ మాట్లాడుతూ చిత్రోత్సవ నిర్వహణకు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎనలేనిదన్నారు. చిత్రోత్సవానికి నాణ్యమైన చిత్రాలనే ఎంపిక చేశామని, తొలిసారిగా లఘు
చిత్రాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ 'మా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీసిన
సినిమాలను చిత్రోత్సవంలో ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. మా గద్వాల నియోజక వర్గానికి చెందిన పిజి విందా 'లోటస్ పాండ్'
చిత్ర రూపకల్పనలో భాగస్వామి. అలాగే 7 డేస్ ఇన్ స్లో మోషన్ చిత్రం నిర్మించిన బసి రెడ్డి కూడా మా ప్రాంతం వాడే కావటం గర్వంగా
ఉంది' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి చౌదరి మోహన్ జత్వా, నటులు నాగార్జున, రామ్, సమంత, నిర్మాత
రామానాయుడు, అశోక్‌కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.