‘లక్ష్మణరేఖ’ ఎన్.గోపాలకృష్ణ రచించిన ‘ద పయనీర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఫిలింనగర్ తెలుగు సినిమా నిర్మాతల కౌన్సిల్ హాలులో జరిగింది. ఎ.పి.ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఐ&పిఆర్ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి, తొలికాపీని దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్ కు అందజేశారు. సీనియర్ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవ తదితర సినీప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రచయిత గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘విదేశాల నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకుని భారతదేశంలో సినిమాను ప్రారంభించిన దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్యలను మనం స్మరించుకోవాలని అన్నారు. విదేశీయుల రుణం తీర్చుకునేందుకు తనవంతుగా గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్ లోగో పతాకాన్ని, ఈ చరిత్ర పుస్తకాన్ని వారికి బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పారు.
కమిషనర్ మాట్లాడుతూ- ‘అనేక భారతీయ భాషల్లో చలనచిత్రాలు నిర్మించిన ఆద్యులైన నిర్మాత, దర్శకులు, స్టూడియో అధినేతల చరిత్రను ఉదహరిస్తూ ఈ పుస్తకాన్ని కష్టపడి, రీసెర్చ్ చేసి రాసిన గోపాలకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకం మనదేశంలోనూ, విదేశాలలోనూ ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఇలాంటి పుస్తకాలు వారు ఇంకా రాయాలని, వారికి ఎఫ్.డి.సి. సహకారం వుంటుందని’ అన్నారు.
దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ మాట్లాడుతూ- ‘గోపాలకృష్ణగారు నాకు చాలాకాలంగా తెలుసు. వారు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలకు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. వారి 50సంవత్సరాల అనుభవంతో రాసిన ఈ పుస్తకం ఎంతో సమాచారాన్ని అందజేసి, సినిమా పరిశ్రమకు ఎంతో ఉపయోగపడగలదని విశ్వసిస్తున్నాను. వారి సేవలను అభినందిస్తూ, వారు మరిన్ని రచనలు చేసేందుకు అందరూ ప్రోత్సహించాలని’ అన్నారు.
నిర్మాత రాఘవ మాట్లాడుతూ- ‘గోపాలకృష్ణ గారికి జయసుధను హీరోయిన్ గా పరిచయం చేసిన ‘లక్ష్మణరేఖ’ చిత్రం ఒక్కటి చాలు. చిత్రసీమలో ఆయన ప్రతిభ చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను రఘుపతి వెంకయ్య గారి ఆఫీసులో పనిచేశాను. ఈనాడు ఆయన పేరున నాకు అవార్డు వచ్చింది. అందుకు ఎంతో గర్వపడుతున్నాను’ అన్నారు.
‘లక్ష్మణరేఖ’ గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘నా పిక్చరు విజయవంతమైనా, నాకు నంది అవార్డు వచ్చినా పొందనంతటి ఆనందం ఈరోజున ఈ పుస్తకం విడుదల సందర్భంగా కలుగుతోందని’ అన్నారు.