| రచయితలు, నటులు, గాయకులు, సంగీత దర్శకులు, సాహితీవేత్తలే సమాజానికి అసలైన
మార్గదర్శకులని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి అన్నారు. కళాకారుల్లో అపారమైన
శకి్త సంపద దాగివుందని ఆయన చెప్పారు. ‘యువ కళావాహిని’ ఆధ్వర్యంలో
రవీంద్రభారతిలో జరిగిన అలనాటి మేటి చలన చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి అవార్డు ప్రదానోత్సవ సభలో
చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రచయితలకు, కథకులు తమ మేథస్సుకు పదునుపెట్టి సమాజానికి గొప్ప సందేశం అందిస్తారనీ,
కళాకారులకు మాత్రం అణుశక్తిని మించిన శక్తి వుంటుందని, నిజమైన సమాజాన్నినిర్మించేది
కళాకారులేనని ఆయన అన్నారు. వర్థమాన సినీ దర్శకుడు వంశీకి ఆయన నిర్వాహక సంస్థ పక్షాన
కె.వి.రెడ్డి అవార్డును ప్రదానం చేసిన అనంతరం మాట్లాడుతూ, టెక్నాలజీ అందుబాటులో
లేనిరోజుల్లో ‘మాయాబజార్’ లాంటి గొప్ప చిత్రానికి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి
మాయాజాలం చేశారని, అటువంటి గొప్ప దర్శకుడి పేరున అంతేస్థాయిని సంతరించుకుంటున్న
దర్శకుడు వంశీకి ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసిన ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదకులు పి.విజయబాబు
వంశీ దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రంలోనూ బాపు గీసిన బొమ్మ దర్శనమిస్తుందనీ, ఆ కారణంగా
వంశీ ఖచ్చితంగా బాపు వారసుడేనని సభికుల హర్షధ్వానాల మధ్య అన్నారు. ఆంధ్రప్రభ
దినపత్రికకు ధారావాహికగా రచనలు అందించిన వంశీ గోదావరి నదీమ తల్లిని వర్ణించిన తీరు
అద్భుతమన్నారు. కె.వి.రెడ్డికి, వంశీకి పోలికలు, వైవిధ్యాలు వున్నాయనీ, అందువల్ల
కె.వి.రెడ్డి పేరున వంశీకి పురస్కార ప్రదానం చేయడం అన్నివిధాలా సముచితమన్నారు. సితార
చిత్రాన్ని చూస్తే వంశీకి సమాజం పట్ల ఎంత అభిరుచి వుందో విదితమవుతుందని విజయబాబు
అన్నారు. కె.వి.రెడ్డి నాణ్యత విషయంలో రాజీపడని, నిక్కచ్చిగా వ్యవహరించిన దర్శకుడు
అయితే వంశీది రాజీపడని ఖచ్చితత్వం అని ఆయన అన్నారు. వంశీ మంచి దర్శకేడేకాక మంచి
రచయిత, గొప్ప కథకుడు అన్నారు. వంశీ మెచ్చిన కథలు అనే పుస్తకంలో మూడు తరారల
రచయితల జీవితాలను ఆవిష్కరించిన వంశీ పుస్తక ముద్రణ విషయంలో కూడా గొప్ప మెళకువలు
పాటిస్తారని కితాబిచ్చారు.
సినీ హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- తెలుగు చలనచిత్ర రంగంలో వంశీ పేరు వినగానే ‘లేడీస్
టైలర్’ సినిమా గుర్తుకు వస్తుందనీ, సినీరంగంలో నిలదొక్కుకోవడానికి తానూ, వంశీ సుమారు
రెండు దశాబ్దాలపాటు పడిన కష్టాలు ఇన్నీఅన్నీ కాదన్నారు. తాను ఎన్ని జన్మలెత్తినా వంశీని
మరచిపోలేనని, కళాకారులు మనసుపెట్టి పనిచేసిన సినిమాలను ఎవరూ ఎన్నటికీ మరచిపోలేరని
రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. వెండితెర మీద తెలుగుదనాన్ని పరుస్తున్న వంశీ, తెలుగు
సినిమారంగానికే ఓ ‘వరం’ అని ఆయన అన్నారు.
సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటులు కృష్ణభగవాన్, తనికెళ్ళ భరని,
కొండవలస లక్ష్మణరావులు తమకు సినీ రంగంలో నిలదొక్కుకోవడానిక భిక్ష పెట్టిన దర్శకుడు వంశీకి
జీవితాంతం రుణపడి వుంటామని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వాశిరాజు ప్రకాశం, సినీ నిర్మాత
గొట్టిముక్కల పద్మారావు, కార్నేషన్ సంస్థ ఎండి డాక్టర్ రామ్ లు ఆత్మీయ అతిథులుగా పాల్గొని
ప్రసంగించారు.
ఈ సందర్భంగా అవార్డు ఎంపిక కమిటీ సభ్యులు జర్నలిస్టులు వాశిరాజు ప్రకాశం, ఎ.రాంబాబులను
ఈ కార్యక్రమానికి సౌజన్యాన్ని అందించిన జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
గుదిబండి వెంకటరెడ్డిని ముఖ్యఅతిథి డాక్టర్ చక్రపాణి ప్రత్యేకంగా సత్కరించారు. యువ కళావాహిని
అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో సాగిన ఈ సభా కార్యక్రమానికి ముందు కె.వి.రెడ్డి,
వంశీ దర్శకత్వం వహించిన పలు చిత్రాలలోని గీతాలను జంట నగరాలకు చెందిన ప్రముఖ గాయనీ
గాయకులు డిఎ మిత్రా, రమణ, విఎ లక్ష్మి, వికె దుర్గ, వీణలు అద్భుతంగా గానం చేసి
ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వివి రామారావు, లంక లక్ష్మీనారాయణలు
వ్యవహరించారు.
|