అమెరికాలో తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాట్స్) ద్వితీయ మహాసభలు అట్టహాసంగా
ముగిశాయి. న్యూజెర్సీ ఎడిసన్‌లోని రారిటాన్ సెంటర్‌లో ముగింపు సంబరాలు మంగళవారం అంగరంగవైభవంగా జరిగాయి. సాంస్కృతిక
ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.
సంప్రదాయ, జానపద నృత్యాలు, హాస్య కార్యక్రమాలు, మిమిక్రీ, జుగల్‌బంది, విలక్షణ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంగీత
దర్శకుడు తమన్ తన బృందంతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రూతలూగించింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన డైలాగులు
మెప్పించాయి. ఇవేకాక ప్రముఖ వైద్యులతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు
చేసిన బాపు ఆర్ట్ గ్యాలరీ సందర్శకులను కట్టిపడేసింది. వేడుకలకు హాజరైన కేంద్ర సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ
తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంబరాల సందర్భంగా నిర్వహించిన నాట్స్ ట్వంటీ-20 క్రికెట్
టోర్నమెంట్ విజేతలకు భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ బహుమతులు ప్రదానం చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రముఖులు
బహుమతులు అందజేశారు. ట్రిపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన గజల్ శ్రీనివాస్‌కు గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టిన నాట్స్ వేడుకలకు తెలుగు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన
ప్రముఖులు హాజరయ్యారు. సంబరాల్లో ప్రవాసాంధ్రులు జ్ఞాపకాలు పంచుకున్నారు. మహాసభలు విజయవంతంగా ముగియడం పట్ల నాట్స్
సంతోషం వ్యక్తం చేసింది. కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది.