కల్చరల్
 
 
 
 
ఘనంగా నవలా చిత్రాల సప్తాహం
పాతచిత్రాల్లో కథావస్తువు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేదని, నిర్మాతలు, దర్శకులు మంచి సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారని... అందుకే ఆ చిత్రాలు నేటికీ అద్భుత కళాఖండాలు ఉన్నాయని డా.అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 'తెలుగు సినిమా-నవలాచిత్రాలు'ప్రదర్సన, విశ్లేషణ సప్తాహం రవీంద్రభారతి మినీ థియేటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు చిత్రంగా 'బాటసారి' ప్రదర్శించారు. భరణి సంస్థ అధినేత్రి, మహానటి భానుమతి అంటే తనకు భయభక్తులుండేవని, నాలోని భయాన్ని పోగొట్టడానికి ఆమె ఎంతో కష్టపడ్డారని అక్కినేని అన్నారు. తాను సినీరంగంలో అడుగుపెట్టే నాటికే ఆమె మహాకళాకారిణిగా రాణిస్తున్నారు... అలాంటి కథానాయికతో నటిస్తే చాలనుకొనేవాణ్ని. అలాంటిది ఆమెతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించానని ఆయన చెప్పారు. ఫాస్ట్‌ఫుడ్‌ లాంటి చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో.. చక్కని సాహిత్యంతో ప్రాణం పోసుకొన్న అలనాటి చిత్రాలను నేటితరానికి చూపించడానికి ప్రయత్నించడం గొప్ప సాహసమేనని వివరించారు. 254 చిత్రాల నా సినీ జీవితంలో నాకు నచ్చిన చిత్రాలు 'బాటసారి', 'సుడిగుండాలు' అని అక్కినేని తెలిపారు. అంతకు ముందు సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు 'బాటసారి' చిత్రాన్ని గురించి విశ్లేషించారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఎం.కాంతారావు , యువకళావాహిని వై.కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ నవలా చిత్రాల సప్తాహం లో.... బాటసారి, జీవన తరంగాలు, ప్రేమనగర్, బలిపీటం, దేవదాసు, డాక్టర్ చక్రవర్తి, ఏకవీర ప్రదర్శిస్తున్నారు. వాసిరాజు ప్రకాశం, రాంబాబు అడ్ల, వై .కే.నాగేశ్వరరావు ఈ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్నారు.