కల్చరల్
 
 
 
 
‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ పుస్తకావిష్కరణ
ప్రముఖ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రచించిన ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం భారతీయ విద్యాభవన్లో జరిగింది. చిమట మ్యూజిక్స్.కామ్ సమర్పణలో రూపొందిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం సంగమ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పాట కచేరిలో కృష్ణ ఆధ్వర్యంలో మిత్ర, విజయలక్ష్మి, శశికళ, శారద, శ్రీకృష్ణ, రమణబాబు, రాములు అలనాటి మధుర గీతాలను ఆలపించారు. ఈ మధురగీతాలను ఆలపించిన గాయకులను ప్రఖ్యాత గాయని జానకి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గాయని జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శారద ఆకునూరి, శోభానాయుడు, పల్లెరామారావు,మండలి బుద్ధప్రసాద్, రావు బాలసరస్వతి, మాధవపెద్ది సురేష్, చిమట మ్యూజిక్.కామ్ శ్రీనివాసరావు,పులగం చిన్నారాయణ, డాక్టర్ సి.నారాయణరెడ్డి, తనికెళ్ళ భరణి, సంజయ్ కిషోర్, దర్శకుడు వంశీ, జనార్దన్ రెడ్డి, సూర్య, కె.ఎం.రాధాకృష్ణన్, శివలెంక కృష్ణప్రసాద్, తాడిశెట్టి వెంకట్రావు, గుమ్మడి గోపాలకృష్ణ, పులగం చిన్నారాయణ తండ్రి పులగం గాంధీ తదితరలు పాల్గొన్నారు.

రావు బాలసరస్వతి, శోభానాయుడు జ్యోతి ప్రజ్వలన గావించగా, సర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకాన్ని డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అందజేయగా, బాలు, జానకిలు పుస్తక రచయిత పులగం చిన్నారాయణను, పబ్లిషర్ శ్రీనివాసరావు చిమటను సత్కరించారు.

ఈ సందర్భంగా శోభానాయుడు మాట్లాడుతూ- ‘పులగం చిన్నారాయణ ఇంతటి అపురూపమైన పుస్తకాన్ని అందించడం ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగమ్ అకాడమీ వారిని అభినందిస్తున్నాను. నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. పుస్తకాన్ని తిరగేస్తుంటే కొన్ని వాక్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఏ సంగీత దర్శుడు ఎలా సంగీతం చేస్తారో అందులో వుంది. చదివేకొద్దీ అద్భుతంగా వుంది’ అన్నారు.

సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ- ‘సంజయ్ కిశోర్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేస్తుంటాడు. పులగం చిన్నారాయణ సేకరించిన ఈ అంశాలు కొందరు చెప్పినవి, చెప్పనివి వున్నాయి. మొట్టమొదటి సంగీత దర్శకుడి పేరుతోపాటు కొన్ని వివరాలు కూడా ఇందులో వున్నాయి. ముఖచిత్రంపై వున్న సంగీత దర్శకుల్లో సుబ్బరామన్ కి మినహాయించి అందరు సంగీత దర్శకులకు పాటలు అందించాను’ అన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- ‘ఈతరం వారికి ఆ తరం సంగీత దర్శకులెవరూ తెలియదు. ఈ గ్రంథం కవర్ పేజీపై స్థలం దొరకకపోవడం వల్ల కొందరి బొమ్మలు వేయలేదు. ఇది మంచి పుస్తకం. ఇంట్లో వుంచుకోదగ్గ పుస్తకం. భవిష్యత్తరాలకు ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తక స్వీకారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది’ అన్నారు.