కల్చరల్
 
 
 
 
తానా ‘తెలుగు వైభవం’
పద్మశ్రీ శోభానాయుడు కూచిపూడి నృత్యాభినయం...పద్మశ్రీ డాక్టర్‌ యెల్లా వెంకటేశ్వరరావు మృదంగ విన్యాసం...కళాతృష్ణ ఆంధ్ర నాట్యం ఆహూతులకు మధురానుభూతులను పంచింది. ప్రముఖ నృత్యగురువులు, సంగీత విధ్వాంసుల నృత్య, సంగీత ప్రదర్శనలు సందర్శకులను మైమరపించాయి. తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో జరిగిన ‘తెలుగు వైభవం’ కార్యక్రమంలో ఈ నృత్య, సంగీత ప్రముఖుల ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగాయి. ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సంగీత,నృత్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి.

మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. మన సంగీత, నృత్య కళలకు నేడు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో రవీంధ్రభారతిలో జరిగిన తెలుగు వైభవం మన కళల మాధుర్యాన్ని అవగతం చేశాయి. తెలుగు వైభవం కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగగా ఉదయం జరిగిన కార్యక్రమానికి రాష్ర్ట మొదటి మహిళ విమలా నరసింహన్‌, సాయంత్రం జరిగిన కార్యక్రమానికి కర్నాటక మాజీ గవర్నర్‌ వి.ఎస్‌.రమాదేవిలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు...
తెలుగు వైభవం సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం సంగీత, నృత్య ప్రియులను చూపుతిప్పుకోకుండా చేశాయి. ఇందులో ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు కూచిపూడి నృత్యం, కళా తృష్ణ ఆంధ్ర నాట్యం, యెల్లా వెంకటేశ్వరరావు మృదంగ విన్యాసం సందర్శకులకు అలరించాయి. డాక్టర్‌ నటరాజ రామకృష్ణ శిష్యుల పేరణి నాట్యం, జి.రామారావు బృందంచే ఆదివాసి జానపద మాధురి నృత్యం, గుమ్మడి గోపాల కృష్ణ ఏకపాత్రాభినయం అందర్నీ ఆకట్టుకున్నాయి. చౌదరి రోశయ్య ఒగ్గు కథ, గడ్డం నర్సయ్య బృందం చిందు యక్షగానం కళాప్రియులకు మధురానుభూతులను పంచింది. సినీ నేపథ్య ఆయనీ కౌసల్య బృందం ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’తో సభ ప్రారంభమైంది.

వనజా ఉదయ్‌ ప్రదర్శించిన తెలుగు శంఖారావం కూచిపూడి నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె, దాదాసాహెబ్‌ అవార్డు గ్రహీత డి.రామానాయుడు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆవుల మంజులత, తానా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు, తానా అధ్యక్షులు కోమటి జయరాం, ఉపాధ్యక్షులు తోటకూర ప్రసాద్‌, సాంస్కృతిక విభాగగం చైర్మన్‌ విజయ అసూరి, తానా ఇండియా కో ఆర్డినేటర్‌ గారపాటి ప్రసాద్‌, సమన్వయకర్తలు చెన్నూరి సుబ్బారావు, వై.కె.నాగేశ్వరరావు, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.