కల్చరల్
 
 
 
 
'యుగపురుషుడు' పుస్తకావిష్కరణ
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన 61 సంవత్సరాల నట ప్రస్థానంపై సీనియర్‌ జర్నలిస్టు యు.వినాయకరావు రచించిన 'యుగపురుషుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. కైకాల సత్యనారాయణ, మురళీమోహన్, సారిపల్లి కొండలరావు, వేమూరి రాధాకృష్ణ, అచ్చిరెడ్డి, ప్రసన్నకుమార్, ఎన్.ఆర్.అనూరాధాదేవి, తారకరత్న, అట్లూరి వెంకట జితేంద్ర, అనిత జి.ఎం. ఇమేజ్ హాస్పిటల్స్, మధు వారణాసి మాస్టర్స్ హోమియోపతి, శ్రీనాథ్, యు.వినాయకరావు, ఆంధ్రప్రభ ఎడిటర్ విజయబాబు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పురంధరేశ్వరి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని మురళీమోహన్ కి, ద్వితీయ ప్రతిని వేమూరి రాధాకృష్ణకు అందజేశారు.

ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ- 'మా నాన్నగారి జన్మదినం రోజు చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వినాయకరావు గారికి కృతజ్ఞతలు. రామారావుగారి గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. తెలుగుజాతి అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటినవారు. సినిమా, రాజకీయరంగాన్ని రెండింటిని ప్రభావతం చేసిన వ్యక్తి. ‘యుగపురుషుడు’ టైటిల్‌ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయన కుమార్తెగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా. నాన్నగారు బాధల్లో ఉన్నప్పుడు, 'నాన్న రాజకీయాలు మీకు ఏమిచ్చాయి, ఆత్మక్షోభ తప్ప' అని అన్నాను. దానికి ఆయన...రాష్ట్రంలో ఏమూలకు వెళ్ళినా 'రామారావు నా వాడు' అంటారని సమాధానమిచ్చారు. ఆయన తెలుగు జాతికి దక్కిన ఓ ఆణిముత్యం. ఆయన ఓ వ్యవస్థ. నేను కూడా నాన్నగారి మీద ఓ పుస్తకాన్ని తీసుకురావాలని యోచిస్తున్నా'నని అన్నారు.

మురళీమోహన్ మాట్లాడుతూ- ‘ఎన్టీఆర్ కారణ జన్ముడు. ఆయన్ను అభిమానించని వారు ఎక్కడా వుండరు. నటుడిగా అనేక పాత్రలు పోషించి, ప్రపపంచంలో ఇలాంటి నటుడు మరొకరు లేరు అని పేరు తెచ్చుకున్నారు. ఎన్నో రికార్డులు సాధించిన మహోన్నత వ్యక్తి ఆయన. రాజకీయాల్లోకి వచ్చి తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి సాటి చెప్పారు’ అన్నారు.

కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ- 'దేవుడు రూపాన్ని మనకళ్లముందుంచిన మనిషి ఆయన. ఆయన వేసిన కృష్ణుడు, రాముడు పాత్రల ఫోటోలను, ఇప్పటికీ పూజిస్తున్నారు. నేను ఒకసారి ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన మేకప్‌ వేసుకుని బయటకువచ్చారు. తిరుపతి నుండి గుండు గీయించుకుని వచ్చిన వారు ఆయన్ను చూసి ఏడుకొండల వాడా వెంకటరమణా అని ఆయనకు పాదాభివందనం చేయడం చూశాను. మనల్ని ప్రేమించే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ స్థాపించారు. అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించిన అంశాలతో యుగ పురుషుడు పుస్తకం వినాయకరావు రాయడం అభినంనందిస్తున్నా'నని అన్నారు.

విజయబాబు మాట్లాడుతూ- ‘తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ. తెలుగుదనానికి ఆయన ప్రతిబింబం. వినాయకరావు అక్షరాన్ని నమ్ముకున్న జర్నలిస్టు. ఆయన ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన రాసిన ఈ పుస్తకం ప్రజలను అలరిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

వేమూరి రాధాకృష్ణ మాట్లాడుతూ- ‘ఎన్టీరామారావు గారి పేరు వింటేనే ఆంధ్రదేశంలో రోమాంచితులు అవుతారు. ప్రస్తుతం రాజకీయ స్వర్ణయుగం అంటున్నారు. మరి ఆయన పాలించిన కాలాన్ని ఏమని అనాలో వారే చెప్పాలి’ అన్నారు.

పుస్తక రచయిత వినాయకరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, సారిపల్లి కొండలరావు తదితరులు మాట్లాడారు.