కల్చరల్
 
 
 
 
కళా రంగంలో కడలి తరంగం
కళారంగంలో ఆయనో రసోత్తుంగ తరంగం. రంగుల రంగస్థల ప్రపంచంలో ఆయన మూర్తిమత్వం ఆద్యంతాలులేని త్రివిక్రమత్వం. కళాకారులను ఆదరించడంలో, ఉత్సాహ ప్రోత్సాహాలనందించి ముందుకు నడపడంలో ాయన కనబరిచే విశాల హృదయం మేరు గిరీంద్ర సమానం. నటనలో ఆయన ప్రజ్ఞా పాటవాలు అసమానం. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చూపే చతురతకు లేదు కొలమానం. ఆయనదో అరుదైన పరిణత... ఆరుపదుల వయసులోనూ కనిపించే దీక్షా దక్షత, ఆయనకే సొంతమైన విలక్షణ ఘనత. పరిపక్వత కోసం పరితపించే బుద్ధుడు. ప్రజలు మెచ్చే విలువలకు నిబద్దుడు. కళామతల్లి సేవలో నిత్యానందుడు.... వివేకం, ఆనందం మూర్తీభవించిన వివేకానందుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి కళావైభవాన్ని చాటడంలో యువకళావాహినికి గల పేరు ప్రఖ్యాతులు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహత్తరమైన కళాసంస్థను అందించిన వై.కె.నాగేశ్వరరావు అద్వితీయుడు, బహుధా అభినందననీయుడు. అరవై వసంతాలు పూర్తిచేసుకుని కళారంగంలో వటవృక్షంలా ఊడలు వేసుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని షష్టిపూర్తి జరుపుకుంటున్న సందర్భంలో ఆయన సేవా మధురిమలను గురించి కొంత వివేచించుకుందాం...

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో జన్మించిన వైకే నాగేశ్వరరావు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రెండు సంవత్సరాల కిందట పదవీ విరమణ చేశారు. కళాకారులను ప్రోత్సహించాలని, భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్న సత్సంకల్పంతో యువకళావాహిని సాంస్కృతిక సేవాసంస్థకు శ్రీకారం చుట్టారు వై.కే. ఆ సంస్థ ద్వారా శతాధిక సామాజిక, సాంస్కృతిక సభలను, కార్యక్రమాలను నిర్విరామంగా సాగిస్తున్నారు.

‘యువ కళావాహిని’ ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాలు :
1. స్వామి వివేకానంద- నేతాజీ జయంతి ఉత్సవాలు.
2. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డ్స్.
3. యువ కళావాహిని స్టేజ్ అవార్డ్స్.
4. యువ కళఆవాహిని వాసిరెడ్డి సీతాదేవి టివి అవార్డ్స్.
5. గురుప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్
6. గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ.
7. బి.ఎస్. సాహితీ పురస్కారం.
8. డాక్టర్ సి.నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు.
9. డాక్టర్ ఎ.ఎన్.ఆర్. నాటిక కళాపరిషత్ పోటీలు.
10. డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ అవార్డ్.
11. కెఓయు రెడ్డీ డైరెక్టర్ అవార్డ్.
12. గోపీచంద్ జాతీయ సాహితీ అవార్డ్.
13. అమర గాయకుల ఆరాధనోత్సవం.
14. స్వర చక్రవర్తులు మంత్లీ మ్యూజికల్ నైట్.
15. భానుమతి జయంతి ఉత్సవాలు.

మూడు దశాబ్దాలకు పైగా శతాధిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్న వై.కే అలుపెరుగని సాంస్కృతిక బంధువు...శేముషీ సింధువు..అందరితో సత్సంబంధాలున్న ఆకర్షక బిందువు.

ఒకపక్క నాటక రంగంలో చక్కటి పౌరాణిక పాత్రల్ని ధరిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ, మరోపక్క పెద్దయెత్తున సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు వై.కే. అయితే ఎంతటి మెగా ఈవెంటైనా ఆయన ముఖంలో చిరునవ్వు ఏమాత్రం చెదరదు. ఎంత హడావుడి, హైరానా ఉన్నా

పరమ ప్రశాంతంగా ఉంటూ అత్యంత సహనంతో, సంయమనంతో పనులన్నిటిని పర్యవేక్షిస్తుంటారు. గౌతమబుద్ధ, వివేకానంద పాత్రలు పోషించటంలో ఆరితేరిన వై.కే ఆ పాత్రలు నేర్పిన విలువలని తన దైనందిన జీవితంలోనూ ఆచరణలోకి తెచ్చేందుకు కృషి చేస్తుంటాడు. నటుడిగా అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న వై.కే విజయవంతమైన జీవితం వెనుక పుట్టెడు విషాదం దాగి ఉందన్న సంగతి బాహ్య ప్రపంచానికి తెలియదు. ఓపిక ఉన్ననాళ్ళు జీవితం గడవడానికి ఉద్యోగం పేరుతో ఊడిగం చేయకతప్పలేదు. అయినా అవకాశం చిక్కినపుడెల్లా తనకు ఎంతో ఇష్టమైన కళారంగానికి మళ్ళి మనసా సేవ చేస్తుండేవారు. రిటైర్మెంట్‌ తరువాత పూర్తిస్థాయిలో కళారంగానికి అంకితమై పనిచేయాలనుకుంటున్న సమయంలో చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకును విధి పొట్టన పెట్టుకుంది. ఆ దుర్వార్తకు కృంగిపోయిన వై.కే మెల్లమెల్లగా తేరుకొని తాను చేయవల్సిన కర్తవ్యం ఇంకా ఉందని గుర్తించి తిరిగి యువకళావాహినికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. తన కొడుకు పేరుమీద గురుప్రసాద్‌ ఎక్సలెన్స్‌ అవార్డును స్థాపించి విద్యారంగంలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు, వర్ధమాన కళాకారులకు ప్రతియేట బహూకరిస్తున్నారు. వర్ధమాన కళాకారులకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించే వై.కే వివిధ సంప్రదాయ కళలకు చెందిన కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే గొప్ప అవకాశాలను అందిస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని అవాంతరాలు తారసపడినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడే దృఢమనస్వి, రమ్యయశస్వి మన వై.కే.

గురుప్రసాద్‌ మీడియా డైరెక్టరీ
ఖండాంతర ప్రాచుర్యాన్ని సాధించిన యువ కళావాహిని సంస్థ ప్రతియేట వెలువరించే గురు ప్రసాద్‌ మీడియా డైరెక్టరీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వివరాలతో పాటు అనేక రంగాలకు చెందిన కళాకారుల అడ్రెస్సులు, ఫోన్‌ నెంబర్లు ఈ డైరీలో ఉంటాయి.

సమున్నత ఆశయంతో అలుపనేదే లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ 60వ వసంతంలోకి అడుగు పెట్టిన వై.కే నాగేశ్వరరావు తన సేవలతో కళారంగంలో మరిన్ని వసంతాలను విరబూయించాలని, తెలుగు వారు గర్వించేలా మరిన్ని భారీ కార్యక్రమాల్ని నిర్వహించాలనీ మనసా కోరుకుందాం. ఆ కళామతల్లి ఆశీస్సులతో నిండు నూరేళ్ళూ చల్లగా ఉండాలని ఆశిద్దాం.

 

- శ్రుతకీర్తి