నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆకాశ రామన్న'. మీరా జాస్మిన్, గౌరీపండిట్ కథానాయికలు. అశోక్ దర్శకుడు. మన్యం రమేష్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''హాస్యం, ఉత్కంఠ కలబోసిన కథ ఇది. నరేష్, శివాజీ, రాజీవ్ పాత్రల మధ్య చోటు చేసుకొనే సంఘటనలు కథను రసకందాయంలో పడేస్తాయి. అసలు ఈ కథలో ఆకాశ రామన్న ఎవరు? అతగాడి లీలలు ఏమిటి? అతని కోసం ఏ స్థాయిలో గాలించారన్నది సస్పెన్స్. కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు మా ప్రయత్నం తప్పకుండా నచ్చుతుంద''న్నారు. ఈ చిత్రంలో నాగబాబు, వేణుమాధవ్, మధు శర్మ, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, సంగీతం: చక్రి, సాహిత్యం: అనంతశ్రీరామ్.
|