నాని, నిత్యమీనన్ జంటగా రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ‘అలా మొదలైంది’ సినిమా 75రోజుల వేడుక దస్పల్లా హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాని, శ్వేతామీనన్, నందినీరెడ్డి, కోదండరామిరెడ్డి, వివేక్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఆఫీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, మేక్ ఎ విష్ సంస్థ ప్రతినిధులకు షీల్డులు అందజేశారు.
కోదండరామిరెడ్డి మాట్లాడుతూ- ‘ఆడియో ఫంక్షన్ కు వచ్చాను. విడుదలైన తర్వాత ఐమాక్స్ లో ఆడియన్స్ మధ్య చూశాను. చాలా బాగా అనిపించింది. చాలారోజుల తర్వాత 80వ రోజు అని ఈ సినిమా యాడ్ చూశాను. దర్శకురాలు తన తొలి సినిమాను నేటి ట్రెండ్ కు తగినట్లుగా చెప్పారు. నాని, నిత్య బాగా చేశారు. వరుస హిట్స్ కొడుతున్న నానిని అభినందిస్తున్నాను’ అన్నారు.
దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ- ‘ఇలా 50రోజులు..75రోజులు.. 100రోజులు... 125రోజులు.. మా సినిమా ఆడాలనేది ఆరంభంలో మా కల. ఓ కొత్త తరహా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానం ఓ వైపు తరిమేది. మీడియా సహకారం అమోఘం. స్వచ్ఛందంగా ప్రమోట్ చేశారు. దానికి మౌత్‌టాక్ కలిసొచ్చి అనూహ్య విజయం దక్కింది. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు.
నాని మాట్లాడుతూ- ‘నందిని ఈ విషయం చెప్పినప్పుడు ఈ సినిమా థాట్స్ అన్నీ చెప్పేది. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆలోచన గురించి చెప్పినప్పుడు మాత్రం నేను చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా విజయానికి అది కూడా కారణమైంది’ అన్నారు.
నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ- ‘25ఏళ్ల కల నెరవేరిందని’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిత్యామీనన్, వివేక్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.