ఫిలిం న్యూస్
 
 
 
 
శ్రీకాంత్-చక్రి ల 'ఆల్ ది బెస్ట్'

శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, లక్కీశర్మ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ ది బెస్ట్’. జె.డి.చక్రవర్తి ఈ చిత్ర దర్శకుడు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో సుధ సినిమా బ్యానర్ పై సాంబశివరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ డి.రామానాయుడు, గిరిబాబు, దాము, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, లక్కీశర్మ, హేమచంద్ర, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తొలిషాట్ కు రామానాయుడు క్లాప్ ఇవ్వగా, దాము కెమేరా స్విచ్ ఆన్ చేశారు. గిరిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘చాలారోజుల తర్వాత జెడి చక్రవర్తి కాంబినేషన్లో మళ్ళీ చేస్తున్నాను. చాలా ఆనందంగా వుంది. మా కాంబినేషన్లో వన్ బై టు, ఎగిరే పావురమా మంచి హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో ఎంటర్ టైన్మెంట్, కామెడీ ప్రధానంగా వుటుంది’ అన్నారు.

జెడి చక్రవర్తి మాట్లాడుతూ- ‘ఈ సినిమా అనుకోగానే శ్రీకాంత్ కి చెప్పాను. కథ కూడా వినకుండానే రెడీ అన్నాడు. నా మీదున్న ఇష్టం, నమ్మకంతో ఓకె చెప్పడం ఆనందంగా వుంది. ఎంటర్టైన్మెంట్, కామెడీతో శ్రీకాంత్ అలరించబోతున్నాడు. ఎప్పటినుంచో మేమిద్దరం మళ్ళీ సినిమా చెయ్యాలనుకున్నాం. ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అన్నారు.

సంగీత దర్శకుడు హేమచంద్ర మాట్లాడుతూ- ‘మ్యూజిక్ కంపోజింగ్ పూర్తయ్యింది. పాటలు చాలా బాగుంటాయి’ అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, జీవా, రఘుబాబు, రంఘనాథ్, ప్రగతి, రావు రమేష్, సుభాషిణి, చంద్రమోహన్ తదితరులు నటిస్తున్నారు. పాటలు : జొన్నవిత్తుల, మాటలు : కృష్ణమోహన్, ఫైట్స్: నందు, ఫొటోగ్రఫీ : శివకుమార్, సంగీతం హేమచంద్ర, నిర్మాత : సాంబశివరావు, దర్శకత్వం : జెడి చక్రవర్తి.