‘బద్రీనాథ్’గా వెరయిటీ పాత్రతో మెప్పించిన అల్లు అర్జున్... మళ్లీ తన పంథాలోకొచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
వినోదాత్మకంగా సాగే ఓ యాక్షన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎస్.రాధాకృష్ణ
(చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది.
ముహూర్తపు దృశ్యానికి వీవీవినాయక్ కెమెరా స్విచాన్ చేయగా, మరో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ ఇచ్చారు. స్టార్
డెరైక్టర్ కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్టయిల్‌లో పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇదని, అల్లు అర్జున్,
త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా ఉంటుందని దానయ్య అన్నారు.
‘‘ఈ నెల 14న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. రెండు పాటలను
విదేశాల్లో చిత్రీకరిస్తాం. డా.రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.ఆ పాత్ర సినిమాకు ఓ ఎట్రాక్షన్. అల్లు అర్జున్ సరసన తొలిసారి ఇలియానా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని రాధాకృష్ణ తెలిపారు.
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎమ్మెస్
నారాయణ, ధర్మవరపు, సోనూసూథ్, బ్రహ్మాజీ, రావు రమేష్, శ్రావణ్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
కెమెరా: అమోల్ రాధోడ్, ఆర్ట్: రవీంద్ర, లైన్ ప్రొడ్యూసర్: రవి సుర్నెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.సుబ్బారావు, ప్రొడక్షన్ కంట్రోలర్:
జి.సత్యనారాయణ.