Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
14న ‘అందరి బంధువయ’
      ఈ కాంక్రిట్‌ జంగిల్‌లో ఎవరికి వారే యమునా తీరే.. అనే ధోరణిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.. తోటివారికి కష్టం వస్తే పట్టించుకునే నాథుడే లేడు. మానవత్వ విలువలు అనేవి మచ్చుకైనా కానరావడం లేదు. ప్లాస్టిక్‌ నవ్వులతో.. ఉరుకుల పరుగుల జీవితంతో... స్వార్థమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారందరికి తాము జీవితంలో ఏమి కోల్పోతున్నాం.. జీవితానికి అర్థం ఏమిటి? అనే పలు విషయాలను తెలియజెప్పాలనే సంకల్పంతో 'ఆ నలుగురు' వంటి హృదయాన్ని హత్తుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ చేస్తున్న మరో ప్రయత్నం 'అందరి బంధువయ'. శర్వానంద్‌, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్‌.కె. చంద్రసిద్దార్థ్‌లు కలిసి నిర్మించారు. ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ మాట్లాడుతూ " సినిమాను సంతృప్తిగా తెరకెక్కించిన ఆనందం కంటే నేటి పరిస్థితుల్లో సక్సెస్‌ఫుల్‌గా విడుదల చేస్తుండటం మరింత ఆనందంగా వుంది. ఈ చిత్రం విషయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం మరువలేనిది. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే.. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది' అన్నారు. ఆర్‌.కె. మాట్లాడుతూ -" 'ఆనలుగురు' చిత్రానికి తెలుగు సినిమా చరిత్రలో ఎంతటి ఉన్నతస్థానం వుందో.. ఈ చిత్రానికి కూడా అంతకు మించిన స్థానం లభిస్తుంది.

చంద్రసిద్ధార్థ్‌కు ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెడ్తుంది. 'ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు... మంచి తనమే శాశ్వతం' అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం. పూర్తి వాణిజ్య అంశాలతో చిత్రం రూపొందింది' అని తెలిపారు. తను నటించిన నూటముప్పై సినిమాల్లో టాప్‌ ఫైవ్‌ సినిమాల్లో ఈ చిత్రం వుంటుందని, గుండెను గిల్లి జోలపాడే విధంగా ఈ సినిమా వుంటుందని నటుడు నరేష్‌ తెలియజేయగా, తన మనసుకు హత్తుకున్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నటించడం గర్వంగా వుందని శర్వానంద్‌ చెప్పారు. ఈ వేసవిలో చల్లగా.. ఆహ్లాదంగా వుండే ఓ చక్కని చిత్రాన్ని చూడబోతున్నారని రచయిత బలభద్రపాత్రుని రమణి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనూప్‌, పద్మప్రియ, జయకృష్ణ కూడా పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com