Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘అనుచరుడు’ ప్రారంభం
     శ్రీకాంత్, తరుణ్, జాస్మిన్ (పరిచయం) ప్రధాన పాత్రధారులుగా ప్రహర్ష ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశోక్ అల్లే దర్శకత్వంలో ప్రవీణ్‌బాల నిర్మిస్తున్న ‘అనుచరుడు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.ఈ చిత్రం ద్వారా అశోక్ అల్లే దర్శకునిగా పరిచయమవుతున్నారు. నాయకా, నాయికలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు డి.కె.అరుణ క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత కె.వి.సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేసారు. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత ప్రవీణ్‌బాల మాట్లాడుతూ-‘దర్శకుడు చెప్పిన కథలోని నవ్యత నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. కథకు తగిన ఆర్టిస్టులు కుదిరారు. తరుణ్‌కి ఓ కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టే యాక్షన్ అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ నెల నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే షూటింగ్‌తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని’ తెలిపారు.

దర్శకుడు అశోక్ అల్లే మాట్లాడుతూ- ‘ఓ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉందని’ చెప్పారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘మంచికథతో రూపొందుతున్న ఈ చిత్రంలో తరుణ్ తో కలిసి తొలిసారి నటిస్తున్నానని, దర్శక, నిర్మాతలు ఈ చిత్రం స్క్రిప్ట్ పైబాగా వర్క్ చేశారని’ అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ- ‘శ్రీకాంత్ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా కథలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, సన్నివేశాలు వున్నాయి. చక్రి సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి ఓ ఆకర్షణ’ అన్నారు.

ఈ చిత్రం మాటల రచయిత శ్రీనాథ్ మాట్లాడుతూ-‘అనుచరుడు’ అనే పదానికి అర్థం చెప్పే సినిమా ఇది. అనుచరుడికి విశ్వసనీయత ఎంతముఖ్యమో, నాయకుడికి కూడా అనుచరుడి పట్ల బాధ్యత అంతే అవసరం. దీన్ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రంలో మానవీయ సంబంధాలకు, అనుబంధాలకు పెద్దపీటవేయడంతోపాటు ఆరోగ్యకరమైన వినోదం కూడా వుంటుందని’ అన్నారు.

ఇతర పాత్రలలో పోసాని కృష్ణమురళి, శివారెడ్డి, అజీజ్‌ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: భూపతి, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: కె.సాగర్, నిర్మాత: ప్రవీణ్‌బాల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ అల్లే.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com