'మొగలిరేకులు'తోపాటు పలు సీరియల్స్‌లో నటించిన రవివర్మ కథానాయకుడిగా 'అపార్ట్‌మెంట్' చిత్రం ప్రారంభమైంది. శ్రీక్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రూపొందుతోంది. ఎ.కె. శ్రీకాంత్, సతీష్ కె.వి. వేగేసిన నిర్మిస్తున్నారు. రాజు వి. దర్శకత్వం వహిస్తున్నారు. రానామాయుడు స్టూడియోలో పూజతో శ్రీకారం చుట్టారు. దేవునిపటాలపై నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సతీష్ స్విచ్చాన్ చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనీ, యాక్షన్, థ్రిల్లింగ్ గొలిపే అంశాలుంటాయని శ్రీకాంత్ చెప్పారు. నవంబర్ 9నుంచి రెగ్యులర్‌షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని మరో నిర్మాత సతీష్ పేర్కొన్నారు.
దర్శకుడు చిత్రం గురించి చెబుతూ.. తెలుగు, తమిళభాషల్లో రూపొందిస్తున్నాం. 70 శాతం హైదరాబాద్‌లోనూ, మిగిలినది చెన్నైలో చిత్రిస్తాం. సస్పెన్స్ చిత్రమిది. వంశీగారి చిత్రమైన ఏప్రిల్ 1 విడుదల తరహాలో ఉన్నా స్క్రీన్‌ప్లే కొత్తదనంగా ఉంటుంది. ఇందులో 4 పాటలున్నాయి అని చెప్పారు. 'ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈచిత్రం రూపొందుతోందనీ, ఇ.వి.వి.గారు రూపొందించిన 'ఆరుగురు పతివ్రతలు'లో నటించాననీ, తొలిసారిగా హీరోగా పరిచయవుతున్నానని' రవివర్మ అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సుజాతారెడ్డి, అల్లరి సుభాషిణి, రక్ష, తడివేలు, ఉత్తేజ్, విజరుసాయి తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్, కెమెరా: సాబుజేమ్స్, ఎడిటర్: నాగిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు వి.