బెంగళూరు నుంచి ముంబయి దాకా ఒంటరిగా సాగే ప్రయాణంలో... అనుకోకుండా ఓ అందమైన అమ్మాయి కూడా తోడైతే.. ఇక ఆ
ప్రయాణం ఎంత హుషారుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా?.. తమిళంలో కార్తీ, తమన్నా జంటగా నటించిన 'పయ్యా' చిత్ర కథ ఇది.
లింగుస్వామి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆయనే 'ఆవారా' పేరుతో ఈ చిత్రాన్ని
తెలుగులోకి అనువదించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ పాటలు
శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ - "అనుభూతిని పంచే ప్రేమకథ ఈ
చిత్రం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగువారికి కూడా నచ్చుతుందని నా నమ్మకం' అన్నారు.
నటి తమన్నా మాట్లాడుతూ - "నా కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా. ఇలాంటి పాత్రలు అరుదుగా వరిస్తుంటాయి. మంచి పాత్ర
ఇచ్చి ప్రోత్సహించిన లింగుస్వామికి నా థ్యాంక్స్. ఈ సినిమాలో నేనూ ఒక భాగం అయినందుకు గర్విస్తున్నాను. మంచి
సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు' అని చెప్పారు.
కార్తీ మాట్లాడుతూ- "ఇది నా తొలి కమర్షియల్ హిట్. తమిళంలో దాదాపు 40 కోట్లు వసూలు చేస్తోంది. సరదాగా సాగే ప్రేమ
ప్రయాణం ఈ సినిమా. ఇందులో ప్రతి పాటా వైరైటీగా ఉంటుంది. ఫైట్స్ కూడా చాలా బావుంటాయి. ఎంతో కేర్ తీసుకొని బ్యూటిఫుల్
లవ్‌స్టోరీగా లింగుస్వామి ఈ సినిమాను మలిచారు' అని తెలిపారు. మే 7న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత
జ్ఞానవేల్‌రాజా చెప్పారు. ఇంకా మధుర శ్రీధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.