ఫిలిం న్యూస్
 
 
 
 
20న 'అయ్యారే'

డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అయ్యారే’. సాగర్ చంద్ర ఈ చిత్ర దర్శకుడు. అనీషా సింగ్ కథానాయిక. సుధాకర్ బాబు, రంగన, అచ్చప్పలు ప్రీతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శిశాజీ, శ్రీనివాసరెడ్డి, సాగర్ చంద్ర, నివాస్, సుధాకర్ బాబు పాల్గొన్నారు.

హీరో శివాజీ మాట్లాడుతూ- ‘మా ‘అయ్యారే’ సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రశాంతంగా ఈ నెల 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఒక చిన్న సినిమా పూర్తయ్యి తెరకెక్కాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అన్నీ మేము ఎదుర్కొన్నాము. ఇద్దరు సంబంధంలేని వ్యక్తుల కథ ఇది. నవరసాలు కలిగిన చిత్రం. మంచి కమేడియన్స్ అందరూ దీనిలోవున్నారు. శ్రీనివాసరెడ్డి మంచి పాత్ర చేశారు. రాజేంద్రప్రసాద్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. ఇదే సందర్భంలో చిన్న సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. సినిమాలపై టాక్స్ తగ్గిస్తే ఇండస్ట్రీకి కొత్త నిర్మాతలు ఎంతోమంది పరిచయమై కొత్త సినిమాలను అందిస్తారు. తమిళ సినిమాలను కొనుక్కొని డబ్బింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మన ఇండస్ట్రీకి వుండదు’ అన్నారు.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ- ‘ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాలి. సమయం అనుకూలించక వెనక్కు వెళ్ళింది. ఈ సినిమాకి ‘నిత్యానందం రంజితం’ అని పేరు పెట్టివుంటే ఎప్పుడో విడుదలయ్యేది. ‘అయ్యారే’ అని పెట్టడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు మైలేజ్ పెంచే సినిమా ఇది’ అన్నారు.

దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ- ‘జనవరి 20వ తేదీన విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాము. చాలా కష్టపడి ఈ సినిమాని నిర్మించాము. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుందని ఖచ్చితంగా చెప్పగలను’ అన్నారు.

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ- ‘తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ సినిమా అవుతుందని మా నమ్మకం. సినిమా బాగా రావడానికి శాయశక్తులా ప్రయత్నించాము. ఒక మంచి కథతో మా దర్శకుడు అద్భుతంగా చిత్రించాడని’ అన్నారు.