ఇదివరకు వచ్చిన 'బ్యాచిలర్స్' ద్వారా హీరోగా పరిచయమైన జాకీర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'బ్యాచిలర్స్ 2' చిత్రం షూటింగ్
పూర్తయింది. మరియం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం.వై. హుస్సేన్, హజరా హుస్సేన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో
జాకీర్‌తో పాటు ఎవిన్ రాణా, మెహబూబ్ బాషా, రాజశేఖర్ హీరోలుగా; తృప్తి శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
హాలీవుడ్‌లో వచ్చిన 'రోడ్ ట్రిప్' సినిమా ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నానని జాకీర్ చెప్పారు. సోమవారం షూటింగ్ లొకేషన్‌లో
ఆయన మాట్లాడుతూ "దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. అలీపై చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ రోజు షూటింగ్ పూర్తయింది. 'దశావతారం'
తరహాలో ఈ సినిమాలో 'పంచావతారం'గా అలీ ఐదు అవతారాల్లో కనిపిస్తారు. ఇది నలుగురు కుర్రాళ్ల కథ. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే ఆ
నలుగురు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి ఓపెన్‌టాప్ కారులో వెళ్లేప్పుడు జరిగే సంఘటనల సమాహారం ఈ సినిమా. ఆద్యంతం కామెడీ
ప్రధానంగా కథ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ఆగస్టు నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.
అలీ మాట్లాడుతూ జాకీర్ చాలా బాగా సన్నివేశాలు తీస్తున్నాడనీ, తప్పకుండా 'బ్యాచిలర్స్ 2' విజయం సాధించాలని ఆశిస్తున్నాననీ
అన్నారు. ఇప్పటివరకు ఎవరూ చూపించని లొకేషన్లలో సన్నివేశాలు తీశామని సినిమాటోగ్రాఫర్ అమర్ కుమార్ తెలిపారు.
సుమిత్‌రాయ్, తనికెళ్ల భరణి, జీవా, గౌతంరాజు, దువ్వాసి, సత్యనారాయణరెడ్డి, చిత్రం శ్రీను, చిత్రం బాషా, నామడ అప్పారావు, శ్రీలక్ష్మి, జె.డి.
ప్రసాద్, విష్ణు తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: కలువ సాయిరాయ్, పాటలు: సతీశ్ బాణాల, ఎస్.వి. శేఖర్, అంజాద్, సంగీతం: సందీప్,
కూర్పు: కె. రమేశ్, కొరియోగ్రఫీ: రాజు, కళ: జె.కె. మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చింతా సూర్యప్రకాశ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాకీర్.