Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
బాలకృష్ణ - కుమార్ చౌదరి చిత్రం
     బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీ కీర్తీ కంబైన్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పరుచూరి మురళి దర్శకుడు. ఎం.ఎల్‌.పద్మ కుమార్‌ చౌదరి నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు క్లాప్‌నిచ్చారు. పారిశ్రామికవేత్త కె.రఘు స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణంరాజు, సి.కల్యాణ్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, కె.ఎస్‌.రామారావు తదితరులు హాజరయ్యారు.

దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ- ''బాలకృష్ణ నటించిన 'పెద్దన్నయ్య', 'సుల్తాన్‌' తదితర చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాను. ఏడెనిమిది నెలలు కష్టపడి ఈ స్క్రిప్టు సిద్ధం చేశాం. బాలయ్యబాబు కథ విన్న తరువాత 'రెండు రోజులు ఆగండి..' అన్నారు. ఓరోజు ఫోన్‌ చేసి 'సినిమా చేద్దాం..' అనే సరికి నా ఆనందానికి అవధుల్లేవు. ఇది వరకు 'ఆంధ్రుడు' అనే సినిమా తీశా. 'అనవసరంగా ఆ సినిమా తీశా..' అనుకునేవాడ్ని. కానీ బాలయ్య బాబు ఆ సినిమా చూసి... 'ఆంధ్రుడు సినిమాకి పనిచేసిన టీమ్‌నే ఈ సినిమాకూ తీసుకోండి' అన్నారు. మా కష్టం వృథా కాలేదు అనిపించింది. వినోదం, భావోద్వేగాలు, రొమాన్స్‌.. ఇవన్నీ తగుపాళ్లలో ఉండే సినిమా ఇది. బాలయ్య అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తాం. ఇందులో హీరోయిన్లు ఇంకా ఫైనల్‌ కాలేదు. ఊటీ, మౌంట్‌అబు ప్రాంతాల్లో షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అన్నారు.

నిర్మాత కుమార్‌చౌదరి మాట్లాడుతూ- ''రెండు సంవత్సరాల నుంచీ బాలకృష్ణతో సినిమా చేద్దాం.. అనుకొంటున్నాను. మంచి కథ కోసం అన్వేషిస్తున్నాను. అలాంటి కథ దొరికింది. దమ్మున్న కథ ఇది. మురళితో మూడో చిత్రం చేయడం ఆనందంగా ఉంది. వేసవికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తా''మన్నారు.

సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ- ''ఇలాంటి పెద్ద అవకాశం కోసమే ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్నాను. తప్పకుండా బాలయ్యబాబు అభిమానులు కేరింతలు కొట్టే సంగీతాన్ని అందిస్తా'' అన్నారు. ఛాయాగ్రహణం: విజయ్‌.సి.కుమార్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్‌: రామ్‌-లక్ష్మణ్‌, సమర్పణ: సందీప్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com