నందమూరి బాలకృష్ణ కథానాయకునిగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నెం.3’ షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ కథానాయిక. ఇటీవలే వైజాగ్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తయ్యింది.
నిర్మాత పద్మకుమార్ చౌదరి మాట్లాడుతూ- ‘వైజాగ్లో వేసిన భారీ సెట్లో 25రోజులు చిత్రీకరణ జరిపాం. ఇంటర్వెల్ కు సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించాం. అలాగే బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీరాయ్, సనపై హాస్య సన్నివేశాలు తీసాం. ఈ నెల 24తో ఆ షెడ్యూల్ పూర్తయ్యింది. 28నుంచి మరో షెడ్యూల్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఏకధాటిగా జరిపే షూటింగ్ తో సినిమా పూర్తిచేస్తాం. కర్నూలులో కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తాం. ఈ చిత్రంలో మొత్తం అయిదు పాటలున్నాయి’ అని తెలిపారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ- ‘బాలకృష్ణ ఇమేజ్ ను, బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపజేసే అన్ని అంశాలకూ ఇందులో పెద్దపీట వేస్తున్నాం. షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతోంది’ అన్నారు.
జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణీ మాలిక్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ : సందీప్.