Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సిద్ధార్ధ ‘బావ’ ప్రారంభం
      సిద్ధార్ధ హీరోగా శ్రీ కీర్తి కంబైన్స్‌ పతాకంపై సందీప్‌ సమర్పణలో రాంబాబును దర్శకుడుగా పరిచయం చేస్తూ పద్మకుమార్‌ చౌదరి యం.యల్‌ నిర్మిస్తున్న ‘బావ’ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా వి.వి.వినాయక్‌ క్లాప్‌ నిచ్చారు. కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కుమార్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘చాలా కాలం తరువాత మళ్లీ నేను సినిమా నిర్మిస్తున్నాను. గతంలో నేను నిర్మించిన చిత్రాలను మించి ఈ చిత్రం వుంటుంది.

రాంబాబు అద్భుతమైన కథ చెప్పాడు. సిద్దార్ధ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందే విధంగా వుంటుంది’’ అన్నారు. కథానాయకుడు సిద్ధార్థ మాట్లాడుతూ ‘‘నాలుగు సంవత్సరాల క్రితమే రాంబాబుతో మంచి కథ సిద్ధం చేసుకో మనం చేద్దాం అన్నాను. అది ఇన్నాళ్ళకు కుదిరింది. చాలా కాలం తరువాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తరహాలో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం వుంటుంది. గోదావరి జిల్లాల యాసలో నా పాత్ర వినోదాన్ని పండిస్తుంది’’ అన్నారు. దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ ‘‘చాలా మంది ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటారు. దాంట్లో రక రకాల అర్ధాలు కనిపిస్తాయి. కాని పెళ్లి చేసుకోబోయే మరదళ్ళు పిలిచే ‘బావ’ అనే పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ ధ్వనిస్తుంది. అటువంటి అందమైన ప్రేమ కథే మా ‘బావ’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చక్రి, మాటల రచయిత చింతపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com