ఫిలిం న్యూస్
 
 
 
 
బెజవాడలో 'బెజవాడ రౌడీలు' తాజా షెడ్యూల్‌
నాగచైతన్య హీరోగా వివేక్ దర్శకత్వంలో శ్రేయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'బెజవాడ రౌడీలు' చిత్రం తాజా షెడ్యూల్ సోమవారం విజయవాడలో మొదలైంది. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యతో వేలాది జనం మధ్య 'శరభ శరభ' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. నెలాఖరు వరకూ జరిగే షూటింగ్‌లో కీలక సన్నివేశాల్ని, ఛేజ్, ఫైట్లు చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ 'రాంగోపాల్ వర్మగారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. వివేక్ బాగా తీస్తున్నాడు. నా కెరీర్‌కి ఇది మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు సోదరి ప్రీతిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభు, ముకుల్‌దేవ్, అభిమన్యుసింగ్, అజయ్, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, ఆహుతి ప్రసాద్, సత్యప్రకాష్, ఫణి, భరత్, శ్రావణ్, అశోక్‌కుమార్, రూపా కౌర్,లక్ష్మి, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకి పాటలు: ఎస్.ఎ.రెహమాన్, సిరాశ్రీ, సంగీతం: అమర్ మొహ్లే, బప్పిటూటిల్, విశాల్, విక్రమ్ నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్‌సందీప్, ఫొటోగ్రఫీ: ఎస్.కె.భూపతి, సమర్పణ: వందిత కోనేరు, నిర్మాతలు : రాంగోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్.