ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తమ 84వ చిత్రంగా, పూర్తి వినోదాత్మకంగా ‘బెట్టింగ్ బంగార్రాజు’ను తెరకెక్కిస్తోంది. వినోదభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎదుగుతున్న కథానాయకుడు ’నరేష్‘ ఈ చిత్ర హీరో అయితే, వినోదాత్మక చిత్రాలను రూపొందించే దర్శకుడు ‘ఇ.సత్తిబాబు’ ఈ చిత్రానికి దర్శకుడు. నిధి కథానాయికగా ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఓ పల్లెటూరిలో బాధ్యతా రహితంగా తిరుగుతూ, బెట్టింగ్ లు కాస్తూ జీవితాన్ని గడిపే ’బెట్టింగ్ బంగార్రాజు‘ (నరేష్) జీవితం, నాయిక నిధి పరిచయంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్న అంశాన్ని వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నామంటున్నారు దర్శకుడు ఇ.సత్తిబాబు.
‘బంగార్రాజు’తో పందెం కట్టామంటే మనకు ఓటమి తప్పనిసరి అనేంతగా ఊరిలో వాళ్ళు ఫీలయ్యే పాత్ర నాది. అలాంటి వాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదీ చిత్రం. సకుటుంబ సమేతంగా చూసి మనసారా నవ్వుకునే చిత్రమిదని అంటున్నారు హీరో నరేష్.
సంగీత దర్శకుడు ‘శేఖర్ చంద్ర’ చిత్రంలోని గీతాలకు సమకూర్చిన సంగీతం వీనుల విందుగా సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలోని పలు సుందరమైన ప్రదేశాలలోనూ, రామోజీ ఫిల్మ్ సిటీలోనూ వీటిని కెమెరామెన్ ‘కరుణమూర్తి’ కనుల విందుగా చిత్రీకరించారు.
నరేష్, నిధి నాయకా నాయికలుగా వస్తున్న ఈ చిత్రంలో కష్ణభగవాన్, జయప్రకాష్ రెడ్డి, ఎల్.బి.శ్రీరాం, రఘుబాబు, గిరిబాబు, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, అమిత్, సామ్రాట్, ప్రవీణ్, ధన్ రాజ్, విజయ్ సాయి, కల్పన, సురేఖావాణి, సన, హేమ, జ్యోతి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ’లంకపల్లి శ్రీనివాస్‘ కథకి ‘గమ్యం’ సినిమా రచయిత ’గంధం నాగరాజు‘ మాటలు అందించారు.