సంసారం సజావుగా సాగాలంటే ఆలుమగల మధ్య అన్యోన్యం తప్పనిసరి. ఒకరినొకరు అర్థం చేసుకొని మెలగాలి. అప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది. జీవితంలో క్లిష్టమైన సమస్యలెదురైనా వాటిని దాటుకెళ్లిన ఓ జంట కథే మా చిత్రం అంటున్నారు దినేష్‌బాబు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భలే మొగుడు భలే పెళ్లాం'. రాజేంద్రప్రసాద్, సుహాసిని జంటగా నటించారు. జొన్నాడ రమణమూర్తి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
నిర్మాత మాట్లాడుతూ ''వినోదంతో కూడుకొన్న కుటుంబ కథా చిత్రమిది. రాజేంద్రప్రసాద్ ఆదాయపు పన్ను శాఖ అధికారిగా, సుహాసిని బ్యాంక్ ఉద్యోగినిగా నటించారు. భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ చిత్రం. సమస్యలెదురైనప్పుడు ఒకర్నొకరు ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పాం. దర్శకుడు దినేష్‌బాబు చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంద''న్నారు నిర్మాత. నరేష్, కావేరీ ఝా, రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్ధన్, ఝాన్సీ, రజిత, రమ్యశ్రీ, శిల్ప, సందీప్తి, ఉషశ్రీ తదితరులు నటించారు.
|