కౌశిక్ ప్రధాన పాత్రధారిగా గ్లోబల్ పీస్ క్రియేటర్స్ సంస్థ జె.కె. భారవి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శ్రీ ఆదిశంకరాచార్య'
చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటిలో, రెండో షెడ్యూల్ కేరళ జరిగినట్లు
భారవి చెప్పారు.
ఈ రెండు షెడ్యూల్స్‌లో 21 సీన్లు, రెండు పాటలు చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడో షెడ్యూల్ త్వరలో
ప్రారంభమవుతుందని, శ్రీహరి పాల్గొనే సన్నివేశాలను ఇందులో చిత్రీకరిస్తామని భారవి చెప్పారు. శంకరాచార్య
పాత్రను భక్తిశ్రద్ధలతో చేస్తున్నట్లు కౌశిక్ చెప్పారు.
శంకరాచార్య తండ్రిగా ఆనంద్, తల్లిగా రోహిణి, రుద్రాక్షస్వామిగా నాగబాబు నటిస్తున్నారు. ఇంకా ప్రముఖ
నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారని నిర్మాతలు చెప్పారు.
'ఈ సినిమా చాలా బాగా వస్తోంది. ఇటీవల దాసరి నారాయణరావుగారు మా దర్శకుడు భారవిని ఇంటికి
పిలిపించుకుని మొత్తం స్క్రిప్ట్ విని, ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టిస్తుందని అన్నారు.
ఆయనకు మా కృతజ్ఞతలు. అలాగే మాకెంతో సహకరిస్తున్న నిర్మాత నారా జయశ్రీదేవిగారికి, కన్నడ హీరో
వాసుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: నాగ్ శ్రీవత్స, ఫొటోగ్రఫీ: పి.కె.హెచ్.దాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: ఉదయభాస్కర్, కథ, మాటలు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.కె.భారవి.