' సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బ్రోకర్'. ఆయనే ఈ చిత్రానికి దర్శకుడు. మయూరి నాయిక. మద్దినేని రమేష్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. సీపీఐ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆర్పీ మాట్లాడుతూ ''నేను తెరపై కనిపించి ఆరున్నర సంవత్సరాలు అయింది. 'శీను వాసంతి లక్ష్మీ' చిత్రం తరవాత సరైన పాత్రలు రాలేదు. ఈ బ్రోకర్ చిత్రంలోని పాత్రకు నేనైతే సరిపోతానని అనిపించింది. అవినీతి అనేది బ్రోకర్‌ల ద్వారా ఏ స్థాయిలో జరుగుతుందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. కలుపుమొక్కలను ఏరివేసి అవినీతిని నిర్మూలించవచ్చని చాలా సినిమాల్లో చూసుంటారు. లంచగొండితనాన్ని అరికట్టడం ఎలాగో కొత్త కోణంలో చూపిస్తున్నామ''న్నారు. ''ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేసి అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు నిర్మాత. వేద, సురేష్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, ధర్మవరపు, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మాటలు: యమ్.వి.యస్.హరనాథరావు.
|