ఎన్టీఆర్‌ 'బృందావనం'
     ఎన్టీఆర్‌ కథానాయకుడిగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం'. గోవిందుడు అందరివాడేలే.. అనేది ఉపశీర్షిక. దిల్‌ రాజు నిర్మాత. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రం శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర కథానాయకుడు నాగార్జున క్లాప్‌నిచ్చారు. దర్శకుడు వి.వి.వినాయక్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజు మాట్లాడుతూ ''దిల్‌ చిత్రం చేస్తున్నప్పటి నుంచీ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకొంటున్నాను. ఇన్నాళ్లకు సరైన కథ దొరికింది. వంశీ చెప్పిన కథాంశం ఎంతో నచ్చింది. ఇది మా సంస్థ నుంచి వస్తోన్న పదకొండో చిత్రం. మంచి కథకు స్టార్‌ హీరో జత కలిస్తే ఎంత బాగుంటుందో బృందావనం విడుదలయ్యాకా తెలుస్తుంది. ఇంటి సెట్‌ వేస్తున్నాం. వచ్చే యేడాది వేసవిలో విడుదల చేయాలనుకొంటున్నామ''న్నారు. ''మున్నా తరవాత మా నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ కథను సిద్ధం చేసుకున్నాను. ఇది వినగానే అంగీకరించిన ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు'' అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్‌రెడ్డి, డి.సురేష్‌బాబు, మెహర్‌ రమేష్‌, శ్రీహరి, పీటర్‌హెయిన్స్‌, వల్లభనేని వంశీమోహన్‌, జెమిని కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 'బృందావనం'లో శ్రీహరి, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. మాటలు: కొరటాల శివ, సంగీతం: తమన్‌.ఎస్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com