గత ఏడాది 'ఫిటింగ్ మాస్టర్', 'బెండు అప్పారావు'లతో రెండు విజయాలు స్వంతం చేసుకున్న ఇవివి సత్యనారాయణ ఇప్పుడు 'బురిడీ' పేరుతో మరో సంపూర్ణ హాస్య చిత్రం చేస్తున్నారు. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య జంటగా నటిస్తారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 1న హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.
ఇవివి మాట్లాడుతూ - ఇది నాకు 50వ చిత్రం. గుర్తుండిపోయే చిత్రం కావాలనుకుంటున్నాను. స్క్రిప్టు కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో 50 మంది నటీనటులు ఉంటే అందులో 30 మంది ప్రముఖ కమేడియన్లే ఉంటారు. ప్రతి పాత్రకూ 'బురుడీ' అనే పేరు వర్తిస్తుంది. రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఈ చిత్రం నవ్విస్తుంది. మంచి అభిరుచిగల నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో రెండవ షెడ్యూల్ బ్యాంకాక్‌లో చేస్తాం. మొత్తం కమేడియన్లు అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్తున్నాం. మేలో చిత్రం విడుదల చేస్తాం - అని చెప్పారు. చలపతిరావు మాట్లాడుతూ - 2010 నవ్వుల సంవత్సరం కావాలని ఇవివి అన్నారు. ఇది ఆయన 50వ చిత్రం. ఈ ఊపులో ఇవివి 100 చిత్రాలు పూర్తి చేయాలి - అని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, హేమ, కల్పన, నిర్మాతలు మాట్లాడారు.
ఈ చిత్రానికి సంగీతం : కోటి, మాటలు : జనార్థన మహర్షి, రచనా సహకారం : మోహన్, శ్రీనివాస్, ఫోటోగ్రఫీ : వి.శ్రీనివాసరెడ్డి, సహనిర్మాత : ఈడ్పుగంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిర్మాతలు : ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు.