ఫిలిం న్యూస్
 
 
 
 
దేశంలోనే మహేష్‌లాంటి హీరో లేడు

‘‘‘అల్లూరి సీతారామరాజు’ 50 రోజుల్లో తీసిన సినిమా. మోసగాళ్లకు మోసగాడు, సర్దార్ పాపారాయుడు 28 రోజుల్లో తీసిన సినిమాలు. అవి ఏ స్థాయి విజయాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నా ‘నీడ’ చిత్రం 10 రోజుల్లో రూపొందింది. జడ్జిమెంట్ అనేదే లేకుండా షాట్‌లు మీద షాట్‌లు తీస్తూ... ‘ఎడిటింగ్ రూమ్‌లో చూసుకుందాంలే’ అని ఆలోచిస్తున్న అసమర్థ దర్శకులున్న నేటి రోజుల్లో... మళ్లీ నాటి దర్శకుల్ని గుర్తు చేస్తూ కేవలం 74రోజుల్లో అద్భుతంగా సినిమా తీసి, శభాష్ అనిపించుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని రోజులు సినిమా తీశామన్నది కాదు, ఎంత గొప్పగా తీశామన్నదే ముఖ్యం.

ఎన్ని రోజులు సినిమా ఆడిందన్నది కాదు, ఎంత డబ్బు వసూలు చేసిందన్నది ముఖ్యం అని నిరూపించారు మహేష్, పూరి జగన్నాథ్. పోకిరి, దూకుడు, బిజినెస్‌మేన్ చిత్రాల ద్వారా మూడుసార్లు తెలుగు సినిమా స్టామినాను నిరూపించిన మహేష్‌ని అభినందిస్తున్నాను. డా.దాసరి నారాయణరావు అన్నారు. మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం ‘బిజినెస్‌మేన్’. ఈ చిత్రం ఆడియో హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి పై విధంగా స్పందించారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ -‘‘ ‘దూకుడు’ వచ్చిన వంద రోజులకే ‘బిజినెస్‌మేన్’ వచ్చి ఆ రికార్డులను క్రాస్ చేసినందుకు ఆనందంగా ఉంది. అమెరికాలో దూకుడు, బిజినెస్‌మేన్ రికార్డులు క్రియేట్ చేశాయి’’ అన్నారు. ‘‘సెప్టెంబర్ 23 నుంచి నాకు ఒక కలలాగా ఉంది. నా అభిమానులు కూడా అలాగే ఉన్నారు. వరుసగా బ్లాక్‌బాస్టర్లు వస్తున్నాయి. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి నిర్మాత వెంకట్‌గారి రాజీలేనితనమే కారణం. పూరి ఎంతో ఫైర్‌తో డైలాగులు రాశారు. ఆ డైలాగుల్లో నిజం ఉందని నమ్మాను కాబట్టే అంత బాగా చేశాను’’ అని మహేష్ అన్నారు.

దేశంలోనే మహేష్‌లాంటి హీరో లేడు
‘‘‘బిజినెస్‌మేన్’ కాన్సెప్ట్ చెప్పింది నేనే, ఈ సినిమా చూశాక నా ఐడియాను ఇంత అద్భుతంగా తీయొచ్చా అనిపించింది. దాసరిగారు తెలుగులో మహేష్ అంత యాక్టర్ లేడని అన్నారు. కానీ ఇండియాలో లేరని నేనంటాను’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఆదిశేషగిరిరావు, కె.అచ్చిరెడ్డి, కాజల్ అగర్వాల్, తమన్, దిల్‌రాజు, సురేష్‌రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.