శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం ప్రారంభమైంది. ‘ఆప్తరక్షక’ పేరుతో విష్ణువర్ణన్ హీరోగా కన్నడలో విజయవంతమైన ‘చంద్రముఖి-2’ను తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. ‘చంద్రముఖి’, ‘ఆప్తరక్షక’ దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తొలిషాట్ కు పూరి జగన్నాథ్ క్లాప్ ఇవ్వగా, డి.రామానాయుడు కెమేరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- ‘కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయి, 40కోట్లకు పైగా వసూలు చేస్తున్న ‘ఆప్తరక్షక’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ బాబుతో చేయడం ఆనందంగా వుంది. రెగ్యులర్ షూటింగ్ మే 5న హైదరాబాద్ లో ప్రారంభమై, 12నుంచి విజయనగరంలో కంటిన్యూ అవుతుంది. వెంకటేష్ బాబుకు మంచి సినిమా అవుతుంది’ అన్నారు.
దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ- ‘తమిళంలో నేను చేసిన ‘చిన్నతంబి’ని తెలుగులో ‘చంటి’గా వెంకటేష్ చేశారు. అప్పట్లో ‘చంటి’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ చిత్రం కూడా వెంకటేష్ బాబుకు చక్కగా సూట్ అవుతుంది. ‘చంద్రముఖి’ తర్వాత కన్నడంలో నేను చేసిన ‘ఆప్తరక్షక’ ఆధారంగా చేస్తున్న సినిమా ఇది. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వుండే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా వుంటాయి. తెలుగులో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, దిల్ రాజు, పాల్గొన్నారు. అనూష్క, రిచ, కమలిని, శ్రద్దాదాస్, పూనమ్ కౌర్, సుజ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, సమర్పణ: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : పి.వాసు.