ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకునేందుకు అంతా సిద్ధమైంది. మళ్లీ నటించాలనే
తన మనసులోని కోరికను మెగాస్టార్ ఇటీవలి కొంతకాలంగా అడపాదడపా వ్యక్తం చేస్తున్న సంగతి
తెలిసిందే. అభిమానులు నటించమని ఒత్తిడి తెస్తున్నారంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తాను మళ్లీ సినిమాల్లో నటిస్తే రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎలాంటి
విమర్శలు వస్తాయోనన్న సందిగ్ధత కూడా చిరంజీవిలో ఉంది. అందుకే అన్ని జాగ్రత్తలు
తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులను తెరపైకి తీసుకొస్తున్నారు. అభిమానుల కోరిక
మేరకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన చిరంజీవి... ఇప్పుడూ వారి ఒత్తిడి మేరకే నటిస్తున్నానని
చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది చివరకల్లా చిరంజీవి కొత్త సినిమా ఉంటుందని ఆయన
కుమారుడు రాంచరణ్ తేజ ఆదివారం తన తండ్రి జన్మదిన వేడుకల్లో తేల్చేశారు.
వాస్తవానికి చిరంజీవి సినిమాల్లో నటించబోతున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో అభిమానుల నుంచి నటించాలని ఒత్తిడి వచ్చిన
సంఘటనలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో 'లేదు' అనకుండా 'చూద్దాం' అంటూ రీ ఎంట్రీకి
వీలుగా లైన్ క్లియర్‌గా ఉంచుకున్నారు. రెండు నెలల క్రితం అల్లు అర్జున్ సినిమా ఆడియో ఫంక్షన్‌లో
స్వయానా సోదరులు పవన్‌కల్యాణ్, నాగబాబు 'అన్నయ్య మళ్లీ సినిమాల్లో నటించాలి' అని
ప్రతిపాదించారు. ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో అభిమానులతో జరిగిన సమావేశంలోనూ వచ్చిన అలాంటి
ప్రతిపాదనకు చిరంజీవి 'చూద్దాం' అనే మాటిచ్చారు. 'రోబో' సినిమా ఆడియో వేడుకలో తాను
మళ్లీ సినిమాల్లో నటిస్తే రోబోనే స్ఫూర్తిదాయకమవుతుందని చెప్పారు. ఇలా ఏదో ఒక విధంగా ఇటీవల
చిరు 'సినిమా వార్తలు' వెలువడుతూనే ఉన్నాయి.
'తెలంగాణ'తోనే ఆలస్యం!
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో నిస్తేజంగా ఉన్న పీఆర్పీ నేతలు, అభిమానుల్లో ఉత్తేజం కలిగించడానికి మళ్లీ
సినిమాల్లో నటించాలని మెగాస్టార్ చాలా రోజుల కిత్రమే నిర్ణయం తీసుకున్నప్పటికీ, తెలంగాణ సమస్య
ఆయన కాళ్లకు బంధం వేసినట్టు సన్నిహితులు చెబుతున్నా రు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో
సమైక్యనినాదం చేయడంతో పీఆర్పీపై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. పార్టీ తరఫున గెలిచిన
ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చిరంజీవికి దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తాను నటించే సినిమా పట్ల తెలంగాణలో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అనుమానంతో
చిరు తన సినీ రంగ ప్రవేశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా,
అభిమానుల ఒత్తిడి పేరిట మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు కూడా ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతోనూ..
తెలంగాణలో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి
ఉంటుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారని సమాచారం. డిసెంబరు 31 తరువాత తెలంగాణపై
స్పష్టత వచ్చే అవకాశముండడంతో వచ్చే ఏడాది చివరకు సినిమా పూర్తి చేసే ప్రణాళికలో చిరు ఉన్నట్టు
తెలిసింది.
వచ్చే ఏడాదికల్లా నాన్న సినిమా: రాంచరణ్
చిరంజీవి సినిమా వచ్చే ఏడాది చివరికల్లా ఉండొచ్చని ఆయన కుమారుడు, నటుడు రాంచరణ్ తేజ స్పష్టం
చేశారు. ఈ ఏడాది జన్మదిన వేడుకలను కేవలం కుటుంబసభ్యుల మధ్యే జరుపుకుంటానని చెప్పిన
మెగాస్టార్ ఎవరికీ అందుబాటులో లేరు. అయితే ఆయన కుమారుడు రాంచరణ్ బ్లడ్ బ్యాంకులో జరిగిన
వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ...'నాన్న సినిమాల్లో నటించాలి. అయితే
ఎప్పుడన్నది నేను స్పష్టంగా చెప్పలేను. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా ఉంటుందని
అనుకుంటున్నాను' అని కేరింతల మధ్య ప్రకటించారు. 'బ్లడ్ బ్యాంక్ మీద కొంతమంది ఆరోపణలు
చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీ ప్రేమముందు ఏపాటి. మా ఫ్యామిలీ ఎప్పుడూ మీకు (అభిమానులు)
రుణపడి ఉంటుంది. మీ కెలాంటి సేవలు కావాలన్నా నాన్న చేశారు. బాబాయి చేశారు. పవన్‌కల్యాణ్
చేశారు. అల్లు అర్జున్ చేశారు.. నేనూ చేస్తాను. మా కుటుంబం మీకెప్పుడూ సేవలు చేస్తూనే
ఉంటుంది' అని చెప్పారు.