నాగార్జున అక్కినేనితో వరుసగా చిత్రాలు నిర్మించే శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ అధినేత డి.శివప్రసాదరెడ్డి ఇప్పుడు నాగార్జున తనయుడు నాగచైతన్యతో 'దడ' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకొని చివరికి 'దడ' టైటిల్ ఫైనలైజ్ చేశాం.
నాగచైతన్య చిన్నతనం నుంచి నాకు తెలుసు. నా ఒళ్లో కూర్చుని పెరిగాడు. అతనితో మంచి సినిమా చేయడం నా బాధ్యత. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్, మనీలా, అమెరికా, యూరప్‌లో జరుగుతోంది. ఎక్కడా రాజీ పడకుండా భారీగా తీస్తున్నాం. కామాక్షి బేనరులో ఖరీదైన సినిమా ఇదే. ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. జూలైలో ఆడియోను, ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతం అందించాడు. నాగచైతన్య గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. 'దడ' అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది ఈ సినిమాలో. యాక్షన్ పార్ట్ బాగా వచ్చింది. బ్యాంకాక్ ఫైట్ మాస్టర్ ప్రడిట్ సీలుయెమ్ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. దర్శకుడు అజయ్ భూయాన్ బాగా తీస్తున్నాడు. ఇంతవరకూ చిత్రీకరించిన సన్నివేశాల్లో వేస్ట్ సినిమా ఒకటీ లేదు. సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. నాలుగు పాటలను సెట్స్‌లో చిత్రీకరించాం. రెండు పాటలు యూరప్‌లో తీయాలి. అమెరికాలో ఓ తెలుగు యువకుడికి ఎదురైన సంఘటనలే ఈ చిత్రకథ' అన్నారు.
సహ నిర్మాత చందన్‌రెడ్డి మాట్లాడుతూ 'మా బేనర్‌కి ఇది ఛాలెంజింగ్ చిత్రం. ఫిలిప్పియన్స్‌లో షూటింగ్ చేసిన రెండో ఇండియన్ సినిమా మాదే. కొత్త కొత్త లొకేషన్లలో షూటింగ్ చేశాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి. చైతన్య నాకు ఆప్తమిత్రుడు. అతను హీరోగా, నేను నిర్మాతగా ఈ సినిమా తయారుకావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం చైతన్య బాగా హార్డ్‌వర్క్ చేశాడు' అన్నారు.
కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, ఆలీ, రాహుల్‌దేవ్, ముఖేష్ రిషి, కెల్లీ డార్జ్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, ఇయాజ్ ఖాన్, కులదీప్, జునైద్ ఇతర ముఖ్యతారాగణం.