ఫిలిం న్యూస్
 
 
 
 
సుమంత్ కి 'దగ్గరగా... దూరంగా'
సుమంత్, వేదిక, సింధుతులానీ ముఖ్యతారలుగా చావలి రవికుమార్ దర్శకత్వంలో జె.సాంబశివరావు- సుధా సినిమా పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘దగ్గరగా... దూరంగా...’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని బుధవారం దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఇది ‘రొమాంటిక్ థ్రిల్లర్’గా ఉంటుందని, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నానని హీరో సుమంత్ తెలిపారు.

‘గోల్కొండ హైస్కూల్’ కన్నా ముందు ఈ చిత్రం కథను ఓకే చేయడం జరిగిందని, బంగారంలాంటి నిర్మాత ఈ చిత్రానికి దొరికారని ఆయన తెలిపారు. ఇది ‘సెన్సిబుల్ ఫిలిం’గా ఆయన వర్ణించారు. మంచి హీరో, మంచి దర్శకుడు, మంచి నిర్మాతల కలయికలో ఈ చిత్రం చేయడం చాలా హ్యాపీగా ఉందని వేదిక అన్నారు. సిట్యుయేషన్ కామెడీతో, రీ-రికార్డింగ్‌కు, కెమెరా వర్క్‌కు మంచి విలువ వున్న చిత్రం ఇదని దర్శకుడు రవికుమార్ తెలిపారు. ప్లెజంట్‌గా ఉండే ఒక పాపులర్ ఫోక్ సాంగ్ ఇందులో ఉంటుందని అన్నారు.

సుమంత్ నటన సహజంగా ఉంటుందని, గ్లామర్ ప్లస్ నటనకు ప్రాథాన్యత ఉన్న పాత్ర వేదిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్లయిమాక్స్ ఈ చిత్రానికి హైలైట్ అని ఆయన చెప్పారు. ఈ చిత్రం తన బేనరులో చేస్తున్నందుకు హీరో, దర్శకులకు నిర్మాత సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా హేట్రిక్ కొడతానని రఘు కుంచె చెప్పారు. మంచి దర్శకుడు, నిర్మాత, కథకు తగిన హీరో, హీరోయిన్ల కలయికలో ఈ చిత్రం విజయం సాధిస్తుందని రఘు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా - సురేందర్‌రెడ్డి.